ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలతో గొడవ పడి.. వారిపై కేసులు పెట్టడం.. వారితో కేసుసు పెట్టించుకోవడం.. సహజంగా.. రాజకీయ నేతలు అనే వారికి కామన్. కానీ నగరి శాసనసభ్యురాలు రోజా మాత్రం.. ప్రత్యేకం. ఆమె సొంత పార్టీ వాళ్లపైనే.. ఫైరవుతుంది. వారిపైనే కేసులు పెడుతుంది. వారు కూడా.. ఆమెపై ఫైరవుతారు. కేసులు కూడా పెట్టారు. వారంతా.. ఎస్సీ వర్గానికి చెందిన వారు కావడంతో.. రోజాపై అట్రాసిటీ ఫిర్యాదు చేశారు. అయితే.. పోలీసులు కేసు నమోదు చేశారా.. లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. రోజా కూడా.. వారంతా వైసీపీ కార్యకర్తలేనని ఒప్పుకుంటున్నారు. అయితే గత ఎన్నికల్లో తన కోసం పని చేయలేదని.. తనకు నమ్మకద్రోహం చేశారని అంటున్నారు.
రోజా.. తమను పట్టించుకోకుండా.. అంటే వైసీపీ కార్యకర్తలను పట్టించుకోకుండా.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మేలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. రోజా.. కార్యకర్తలను సర్ది చెప్పకపోగా.. వారిని మరింత రెచ్చగొట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారి రెచ్చగట్టడంతో పాటు.. వారిపై కేసులు కూడా పెట్టారు. వారంతా తమ పార్టీ వారని ఒప్పుకుంటూ కూడా.. కేసుల విషయంలో రాజీ పడలేదు. దాంతో వారు కూడా.. వెనక్కి తగ్గకుండా… పోరాటం ప్రారంభించారు. తమను కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటన…టీడీపీలోనో.. మరో పార్టీలోనే అయితే.. పోలీసులు ఇప్పటికి.. కేసులు పెట్టేసి ఉండేవారు.
కానీ అక్కడ అధికార పార్టీలో జరిగిన గొడవ కాబట్టి..పోలీసులు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఓ గ్రామంలో.. పార్టీలోని రెండు వర్గాల మధ్య ఉండే గొడవను.. రోజా కావాలనే పెంచిపెద్దది చేసిందని.. ఓ సారి పిలిచి మాట్లాడితే.. అందరూ సర్దుకుపోయేవారన్న భావన వైసీపీలోనే వినిపిస్తోంది. కానీ అలా సామరస్యంగా పరిష్కరించుకుంటే.. రోజా ఎందుకవుతారు..?