గ్రేటర్ ఎన్నికలలో తిరుగలేని విజయం సాధించిన తరువాత ఇప్పుడు తెరాస ప్రభుత్వం గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ల ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. ఇప్పటికే డివిజన్లు, వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేసారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించగానే ఎన్నికల తేదీలు ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు కార్పోరేషన్లతో బాటు మహబూబ్ నగర్ జిల్లాలో అచ్చంపేట మునిసిపాలిటీకి కూడా ఎన్నికలు నిర్వహించవచ్చును. వచ్చే ఈనెల మొదటివారం నుండి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. బహుశః అవి రెండు-మూడు వారాలపాటు కొనసాగే అవకాశం ఉంటుంది. కనుక అవి పూర్తయిన వెంటనే ఎన్నికల తేదీలు ఖరారు చేయవచ్చును. ఇంతవరకు జరుగుతున్న వివిధ ఎన్నికలలో తెరాస పార్టీ వరుసగా విజయం సాధిస్తూ వస్తోంది కనుక ఈ మూడు మునిసిపల్ ఎన్నికలలో కూడా అవలీలగా విజయం సాధించవచ్చును.
ఒకప్పుడు వరంగల్, ఖమ్మం జిల్లాలు తెదేపాకు కంచు కోటలుగా ఉండేవి కానీ ఖమ్మం నుండి తుమ్మల నాగేశ్వర రావు, వరంగల్ నుండి కడియం శ్రీహరి వంటి ముఖ్యనేతలు పార్టీని వీడి తెరాసలో చేరిపోవడంతో ఆ కంచుకోట పునాదులు కదిలిపోయాయి. కాంగ్రెస్ పార్టీకి బలమయిన నేతలు, వారికి పెద్ద క్యాడర్ కూడా ఉన్నప్పటికీ వారు కూడా తెరాస ధాటిని ఎదురునిలిచి పోరాడలేక చేతులు ఎత్తేస్తున్నారు. ఇక బీజేపీ శక్తి సామర్ధ్యాలు ఏపాటివో వరంగల్ ఉపఎన్నికలలో మళ్ళీ గ్రేటర్ ఎన్నికలలో తేలిపోయింది కనుక ఆ రెండు జిల్లాల మున్సిపల్ కార్పోరేషన్ల ఎన్నికలలో అది కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోవచ్చును.
వరుస అపజయాలతో, పార్టీ నేతల వలసలతో ప్రతిపక్షాలు పూర్తిగా డీలాపడి ఉన్న ఈ సమయంలోనే ఎన్నికలు జరిపించేస్తే తెరాస అవలీలగా విజయం సాధించవచ్చును. విజయం సాధిస్తే ప్రతిపక్షాల ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిని ఇక తిరిగి కోలుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చును. కనుక వీలయినంత త్వరగానే ఈ ఎన్నికలు జరిపించవచ్చును.