వ్యక్తిత్వ వికాసం పెరగాలంటే పుస్తకాలు తిరగేయాల్సిన పనిలేదు. కొంతమంది జీవితాల్ని గమనిస్తే చాలు. వాళ్లు ఎదిగిన విధానాన్ని తెలుసుకుంటే చాలు. పరాజయాల ఊబిలోంచి గెలుపు బాట ఎలా పట్టారో తెలుసుకుంటే చాలు. అలాంటి కథ చెప్పబోతున్నాడు సూర్య. `ఆకాశం నీ హద్దురా`తో. సుధా కొంగర దర్శకత్వం వహించిన చిత్రమిది. ప్రముఖ నటుడు మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. టీజర్ ఇప్పుడు విడుదలైంది.
జేబులో ఆరువేలు పెట్టుకుని ఏరో ప్లెయిన్ కంపెనీ పెడదామని ఒకడొస్తే.. ఎవడ్రా ఈ వీపీగాడు అని ఈ లోకం వాడ్ని చూసి నవ్వింది- అనే మోహన్‌బాబు డైలాగ్‌తో ఈ టీజర్ మొదలైంది. పైలెట్ ఆఫీసర్ చంద్రమహేష్గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు సూర్య. తనకంటూ కొన్ని పెద్ద పెద్ద లక్ష్యాలున్నాయి. వాటిని అందుకునే ప్రయాణంలో తనకు ఎదురైన అవమానాలేంటి? వాటిని ఎదుర్కుని విజయం వైపు ఎలా పరుగులు తీశాడు అనేదే ఈ సినిమా కథ. నిజ జీవితంలోని కొన్ని సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా రూపొందించారు. ఓ విజేత కథ ఎప్పుడూ స్ఫూర్తివంతంగానే ఉంటుంది. అలానే ఇందులో చంద్రమహేష్ కథ కూడా స్ఫూర్తిని పెంపొందించేలా తెరకెక్కిస్తే.. ఈ సినిమానే యువతరానికి ఓ వ్యక్తిత్వ వికాస పాఠం అవుతుంది. మామూలు కమర్షియల్ అంశాలకు దూరంగా ఈసినిమాని తెరకెక్కించినట్టు అర్థం అవుతోంది. గత కొంతకాలంగా సూర్య చేతికి హిట్టు దొరక్కుండా పోతోంది. ఈసినిమాతో ఆ విజయాన్ని చవిచూస్తాడేమో చూడాలి.