మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది తెలంగాణ భాజపా. పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసి, జాతీయ నాయకత్వం నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్న నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. ఈ క్రమంలో ఎప్పట్నుంచో వెయిటింగ్ లిస్టులో ఉన్న తెలంగాణ టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎట్టుకేలకు ఇవాళ్ల భాజపాలో చేరారు. నిన్నే ఢిల్లీ వెళ్లిన మోత్కుపల్లి… ఇవాళ్ల భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి, సుజనా చౌదరితో కలిసి మోత్కుపల్లి వెళ్లారు. రెండ్రోజులు కిందటే మోత్కుపల్లి ఇంటికి లక్ష్మణ్ వెళ్లారు. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు.
పార్టీ చేరిన తరువాత మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే భాజపాలో చేరానని మోత్కుపల్లి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందనీ, దాన్లో భాగస్వామి కావాలనే పార్టీలోకి వచ్చానన్నారు. ఒక సామాన్య కార్యకర్తగా భాజపాకి సేవ చేస్తా అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు ప్రారంభిస్తూ… ఆయన దళిత వ్యతిరేకి అన్నారు. ఎన్నికల ముందు ఏవో పథకాలు తెస్తానంటారనీ, ఆ తరువాత అవేవీ అమల్లోకి రావన్నారు. కేసీఆర్ ని గద్దె దించే సత్తా భాజపాకి మాత్రమే ఉందనీ, తెలంగాణలో అధికారంలోకి రాబోయేది భాజపా అన్నారు మోత్కుపల్లి.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న భాజపా, మోత్కుపల్లి రాక ద్వారా ఆ సామాజిక వర్గం నుంచి కొంత ప్రయోజనం ఉంటుందని ఆశిస్తోంది. కానీ, మోత్కుపల్లి ఈ మధ్య క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఓ దశలో తెరాసలో చేరేందుకు కూడా ప్రయత్నించినట్టు కథనాలున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి రెడ్ సిగ్నల్ పడేసరికి… కాషాయం సిగ్నల్ కోసం చూడ్డం మొదలుపెట్టారు. నిజానికి, ఆయన భాజపాలో ఎప్పుడో చేరాల్సింది. అదిగో ఇదిగో అంటూ వాయిదాలు పడుతూ వచ్చింది. ఇన్నాళ్లకి లాంఛనం పూర్తయింది. గవర్నర్ పదవి ఆయన డ్రీమ్. టీడీపీలో ఉండగా అది రాలేదని ఫీలైపోయేవారు. ఇప్పుడు భాజపాలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తా అంటున్నారు! భాజపాలో ఆయన ప్రముఖ నేతగా స్థానం దక్కించుకోవాలంటే… రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తదనంటూ ఎంతోకొంత ప్రభావాన్ని చూపించాలి. ఇక, భాజపాలోకి మరికొంతమంది నేతలు కూడా త్వరలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. గతంలో పెండింగ్ పెట్టినవారికి కండువాలు కప్పేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమౌతోందని సమాచారం.