తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్లో ఎలాంటి మార్పులూ లేవు. ముందు ప్రకటించిన తేదీల ప్రకారమే మొత్తం ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. ఈ మేరకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు వెలువరించింది. నోటిఫికేషన్ వాయిదా వేయాలనీ, రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడమేంటనీ, అభ్యర్థులకు నామినేషన్లు వేసుకునేందుకు కూడా సరిపోయే గడువు ఇవ్వకుండా నోటిఫికేషన్లు ఇచ్చారంటూ, వాయిదా కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గడచిన రెండు వాయిదాల్లో ఎన్నికల షెడ్యూల్ మారుతుందేమో అనే ఉత్కంఠ కొంత నెలకొంది. ఆ మేరకు కోర్టు కూడా ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టింది కూడా! 7వ తేదీన విడుదల కావాల్సిన నోటిఫికేషన్ కూడా ఆపాలని కోర్టు సోమవారం వ్యాఖ్యానించడంతో… తుదితీర్పుపై కొంత ఆసక్తి నెలకొంది. అయితే, మంగళవారం జరిగిన విచారణ అనంతరం ఈ అభ్యంతరాలన్నింటినీ కోర్టు కొట్టేసింది. మున్సిపల్ ఎన్నికలకు ముందు ప్రకటించినట్టుగానే నొటిఫికేషన్ విడుదల చేసుకోవచ్చంటూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎలక్షన్స్ వాయిదా వేయాలంటూ దాఖలైన పిటీషన్లంటినీ ఒక్క దెబ్బతో కోర్టు కొట్టి పారేసింది.
అడ్డంకులు తొలగిపోవడంతో వెంటనే మీడియా సమావేశం పెట్టి, ఎన్నికల నోటిఫికేషన్ ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ప్రకటించారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఓటర్ల జాబితా, ముసాయిదా జాబితాల మధ్య లెక్కలు తేడా ఉన్నాయనీ, అందుకే నోటిఫికేషన్ ఇవ్వలేదనీ, దీనికి సంబంధించి పురపాలక శాఖ వివరణ ఇస్తే… ఏ క్షణమైనా ఆ నోటిఫికేషన్ కూడా విడుదల చేసేస్తామని నాగిరెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి, ముందుగా అనుకున్నట్టుగానే మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి.
కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలన్నీ గాలికి పోయినట్టే! నిజానికి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇలానే ఓటర్ల జాబితాలో తప్పులపై న్యాయ పోరాటం కూడా చేసింది. అదీ ఫెయిలైంది. ఇప్పుడు కూడా ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ న్యాయ పోరాటం చేసే ప్రయత్నమే చేశారు. ఎన్నికల్ని వాయిదా వేయించే అవకాశం ఉంటుందని భావించారు. కానీ, ఇదీ కూడా ఫెయిల్..! ఇప్పుడు దీన్ని కూడా తెరాస ప్రచారాస్త్రంగా వాడుకుంటుంది. కాంగ్రెస్ కి బోధపడాల్సిన తత్వం ఏంటంటే… అనువుగాని చోట అధికులమనరాదు!