పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటించి సైడైపోయారు. ఆయన ఏం చేస్తున్నారో పార్టీ క్యాడర్‌కు కూడా తెలియని పరిస్థితి. మంగళవారం.. రైతుల్ని రెచ్చగొడుతున్నారని… పోలీసులపై మండిపడుతూ.. ట్వీట్ చేశారు. అమరావతిని తరలించవద్దని.. బహిరంగ ప్రకటనలు చేసిన పవన్ కల్యాణ్… ట్విట్టర్ ప్రకటనలకే ఎందుకు పరిమితమవుతున్నారో చాలా మందికి అర్థం కాని ప్రశ్న. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చినప్పుడు.. పవన్ గట్టిగా ఖండించారు. ఆ తర్వాత కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునేవరకూ వేచి చూద్దామని… క్రిస్మస్ హాలీడేస్‌కు యూరప్ వెళ్లిపోయారు. తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటించారు. పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఆ టెంపోను కంటిన్యూ చేయకుండా సైలెంటయిపోయారు.
నిజానికి పవన్ కల్యాణ్.. అమరావతి గ్రామాల్లో పర్యటించినప్పుడు వచ్చిన బజ్ అంతా ఇంతా కాదు. పోలీసుల నిర్బంధాలను సైతం ఎదుర్కొని ఆయన రైతులకు మద్దతు తెలిపారు. ఆ తరహా పోరాటం చేసే నాయకుడు తమ ఎదురుగా ఉంటే.. తమకు మరింత ధైర్యంగా ఉంటుందని అమరావతి గ్రామాల ప్రజలు రైతులు అనుకున్నారు. అయితే.. పవన్ ఆ నమ్మకాన్ని పెంచుకోవడంలో మాత్రం విఫలం అయ్యారు. ఆయన మళ్లీ తన తరపున మరో కార్యాచరణ ప్రకటించలేదు. నిజానికి… పవన్ పై పోలీసులు కేసు నమోదు చేస్తామని లీకులు ఇచ్చారు. అసలు ఓ రాజకీయ నాయకుడికి.. ఇంత కంటే గొప్ప అవకాశం ఎప్పుడూ రాదు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అని.. ఉద్యమంలోకి అడుగు పెట్టి ఉంటే.. ఆయన పొలిటికల్ ఇమేజ్ అసాంతం పెరిగి ఉండేది. కానీ పవన్ సైలెంటయ్యారు.
ప్రజా ఉద్యమాలు చాలా అరుదుగా వస్తూంటాయి. ఎక్కడో ఓ చోట ప్రారంభమై.. రాష్ట్రం మొత్తం వ్యాపిస్తూంటాయి. అలాంటి ప్రజా ఉద్యమం నుంచే నేతలు పుడతారు. ఇప్పుడు.ఏపీలో అలాంటి ప్రజా ఉద్యమం.. అమరావతి నుంచి ప్రారంభమయిందనుకోవాలి. మొదట్లో ఇది 29 గ్రామాల సమస్య అనుకున్నారు. కానీ ఇప్పుడు రైతులందరూ.. ఇది తమ సమస్య అనుకుంటున్నారు. ప్రాంతాల పరంగా చూసినా.. రాజధాని మార్పునకు ప్రాతిపదిక లేకపోవడంతో.. ప్రజల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ప్రజలందరూ రోడ్ల మీదకు వచ్చేందుకు దోహదపడుతోంది. ఈ అవకాశాన్ని కూడా పవన్ కల్యాణ్ జారవిడుచుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.