ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని రైతుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది. వారు అసలు పట్టించుకోవాల్సిన వ్యక్తులు కాదన్నట్లుగా.. ఉండటమే కాదు.. మంత్రులు.. వైసీపీ నేతల చేత… కించ పరిచే వ్యాఖ్యలను చేయిస్తోంది. ఓ రకంగా..వారిని మానసికంగా.. ప్రభుత్వం హింసిస్తోంది. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. వారి వేదన.. ఉద్వేగం.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ప్రభుత్వం ఇంత కఠినాత్మకంగా ఎందుకు ఉంటోందన్న చర్చ అందరిలోనూ ప్రారంభమవుతోంది. ప్రభుత్వం అంటే.. సొంత వ్యవహారంలా.. సీఎం చేస్తూండటం ఏమిటన్న అభిప్రాయాలు సామాన్యుల్లోనూ వినిపిస్తున్నాయి. రైతుల ఆగ్రహం కట్టుతప్పితే.. ప్రభుత్వాలైనా తప్పించుకోవడం కష్టమన్న సంగతిని కొంత మంది గుర్తు చేస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం.. బెంగాల్లో.. నందిగ్రామ్, సింగూరు అనే గ్రామాల్లో భూపోరాటం జరిగింది. ప్రతీ రోజూ ఆందోళనలే. రైతులు.. తమ ప్రాణాలు ఒడ్డారు. బుల్లెట్లకు ఎదురెళ్లారు. లాఠీలను లెక్క చేయలేదు. అయితే అప్పుడు వారు భూసేకరణను వ్యతిరేకించారు. టాటా నానో ఫ్యాక్టరీని కట్టడానికి అప్పటి బెంగాల్ లెఫ్ట్ సర్కార్ అక్కడి రైతుల భూములను తీసుకుంది. దీనికి అక్కడి రైతులు అంగీకరించలేదు. ఈ భూపోరాటాన్ని ముందుండి నడిపించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. లెఫ్ట్ ను… బెంగాల్ నుంచి.. తుడిచి పెట్టయగలిగారు. అసలు లెఫ్ట్ కు ప్రత్యామ్నాయమే బెంగాల్ లో లేదనుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు అక్కడ లెఫ్ట్ కు చోటు లేని పరిస్థితి ఏర్పడింది. రైతు ఉద్యమం తీవ్రంగా జరిగితే.. ఎలా ఉంటుందో నిరూపించే రాజకీయ ఘటన అది.
బెంగాల్ భూపోరాటంతో పోలిస్తే.. అమరావతి భూపోరాటం భిన్నమైనది. ఇక్కడ భూములు ఇచ్చిన రైతులు.. మోసపోయిన పరిస్థితి. ప్రభుత్వమే మోసం చేస్తున్న పరిస్థితి. అందుకే.. రైతుల్లో అంతకు మించిన ఆగ్రహం కనిపిస్తోంది. ఇప్పుడు రాజధాని గ్రామాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. రాజధానికి భూములిచ్చిన గ్రామాలు నిప్పు కణికల్లా మారాయి. ఎప్పుడూ రాజకీయాల గురించి కూడా చర్చించుకోని మహిళలు..రోడ్డెక్కి ఆందోళనలు ప్రారంభించారు. వారిపై కూడా పోలీసులు అత్యంత దారుణంగా.. ధర్డ్ డిగ్రీ పద్దతులు పాటిస్తున్నారు. మహిళలపై దాడులు చేస్తున్నారు. రైతులపై కేసులు పెడుతున్నారు. మరో వైపు.. వైసీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులని.. మరో రకంగా కించ పరుస్తూ.. వారిపై మానసికంగా ఎటాక్ చేస్తున్నారు.
రైతులు, మహిళల పట్ల.. పోలీసులు, వైసీపీ నేతలు, మంత్రులు వ్యవహరిస్తున్న తీరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది. పరిస్థితులు చూస్తే.. కావాలనే రైతుల్ని రెచ్చగొడుతున్నారనే అభిప్రాయం అందరిలోనూ ఏర్పడుతోంది. ప్రభుత్వానికి 33వేల ఎకరాలు ఇచ్చిన రైతుల పట్ల.. ప్రభుత్వ ఎంతో సహృదయతో ఉండాలని కానీ.. ఇక్కడ మాత్రం.. భిన్నంగా ఉందన్న చర్చ నడుస్తోంది. మోసపోయి వంచనకు గురవుతున్న రైతులు.. కన్నెర్ర చేస్తే పరిణామాలు తీవ్రంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయం ప్రభుత్వం గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.