అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ ఉధృతంగా సాగుతున్న ఉద్యమం తెలంగాణలో గత ఏడాది జరిగిన విషాద ఘటనలను గుర్తుకు తెస్తోంది. తెలంగాణలో జరిగిన విషాద ఘటనలేమిటి? అవి అమరావతి ఉద్యమాన్ని గుర్తుకు తెప్పించడమేమిటి? ఎక్కడ ఎలాంటి ఉద్యమం జరిగినా కొందరు ప్రాణాలు కోల్పోతుంటారు. ఇది నిజంగా తీరని విషాదం. కొన్ని ఉద్యమాల్లో హింస కారణంగా చనిపోతారు. కొన్ని ఉద్యమాల్లో ఆవేదనతో, బాధతో, భావోద్వేగాలు నియంత్రించుకోలేక దిగులతో మరణిస్తారు. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో వందలమంది చనిపోయారు. కొందరు ఆత్మహత్యలు చేసుకోగా, కొందరు తెలంగాణ రాదేమోనన్న దిగులుతో గుండెలు పగిలి చనిపోయారు.
గత ఏడాది తెలంగాణలో రెండు నెలలపాటు జరిగిన ఆర్టీసీ కార్మికుల ఉద్యమంలో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఆత్మార్పణ చేసుకోగా, కొందరు ఉద్యోగాలు పోతాయనే దిగులుతో, కుటుంబాన్ని పోషించుకోవడం సాధ్యం కాదనే బాధతో గుండె ఆగి చనిపోయారు. ఇందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆరేనని తీవ్ర విమర్శలు వచ్చాయి. నిజమే…సమ్మె సాగినంత కాలం ఆయన ఆర్టీసీ కార్మికులను పలు విధాలుగా భయపెట్టారు. సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని, ఉద్యోగాలు పోయాయని, ఇక జీవితంలో సంస్థలోకి తీసుకోబోమని…ఇలా అనేక విధాలుగా భయపెట్టే ప్రకటనలు చేయడంతో బలహీన మనస్కులు గుండె ఆగి చనిపోయారు. కొందరు అమాయకులు ‘మా మరణంతోనైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీరాలి’ అని కోరుకుంటూ ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు దిగులుతో ప్రాణం తీసుకున్నారు.
అమరావతి ఉద్యమం మొదలైనప్పటినుంచి వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు (స్పీకర్ కూడా) ప్రజలు, ప్రధానంగా రైతులు భయపడేవిధంగా ప్రకటనలు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నవారిని పెయిడ్ ఆర్టీస్టులని, రియల్ ఎస్టేట్ వ్యాపారులని అన్నారు. అమరావతి ఎడారని, శ్మశానమని నీచంగా మాట్లాడారు. రాజధాని తరలింపును ఎవరూ ఆపలేరని అన్నారు. వైకాపా నాయకులంతా ప్రజలను భయపెడుతున్నారు తప్ప వారికి ఉపశమనం కలిగించేలా, విషయాలు వివరించి కన్విన్స్ చేసేలా మాట్లాడటంలేదు. ఫలితంగా ఇప్పటివరకు దిగులుతో, ఆవేదనతో ఏడుగురు చనిపోయారు. ఈరోజే ముగ్గురు మరణించారు. వీరిలో మహిళ కూడా ఉంది. ఈ మరణాలు ఆర్టీసీ కార్మికుల మరణాలను తలపిస్తున్నాయి.
అయినప్పటికీ ప్రభుత్వం చలించడంలేదు. మంత్రులు పట్టించుకోవడంలేదు. అమరావతి ఉద్యమం విషయంలో ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. ఎలాగూ రాజధానిని మూడు ముక్కలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు కదా. అలా ఎందుకు నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందో, దాని వల్ల రాష్ట్రంలో జరిగే అభివృద్ధి ఏమిటో, భూములిచ్చిన అమరావతి రైతులకు, అక్కడి ప్రజలకు ఎలాంటి మేలు చేయాలనుకుంటున్నారో ముఖ్యమంత్రి జగన్ డైరెక్టుగా చెప్పొచ్చు కదా. వారిని కన్సిన్స్ చేయొచ్చు. సీఎంగా అలా చేయడం ఆయన బాధ్యత. కాని రోమ్ తగలబడిపోతుంటే ఫిడేలు వాయిస్తున్న నీరో చక్రవర్తి మాదిరిగా ఉన్నాడు. ఇక మంత్రులేమో రాజధాని మారుస్తున్నారని ఎవరు చెప్పారు?
జగన్ చెప్పలేదు కదా అని దబాయిస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు తప్ప రాజధాని తరలింపు కాదంటున్నారు. విశాఖ పట్టణాన్ని రాజధాని చేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతున్నా మంత్రులు మాత్రం అమరావతి, కర్నూలు కూడా రాజధానులేనని వాదిస్తున్నారు. మూడు రాజధానులు ఎందుకు చేయాల్సివస్తున్నదో ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన కారణం చెప్పలేదు. ఏమైనా అంటే అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ ఊదరగొడుతున్నారు. రైతుల మరణాలకు కూడా వీరు చలించేలా లేరు.