తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. జనసేన నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అదే సమయంలో.. ఏపీలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో.. ఏపీ స్థానిక ఎన్నికల్లో అయినా ఆ పార్టీ పోటీ చేస్తుందా.. అన్న చర్చ ప్రారంభమయింది. జనసేన పార్టీ.. పార్టీ పెట్టి ఏడేళ్లవుతున్నా.. అదో పెద్ద పజిల్. పార్టీ నిర్మాణం చేయలేకపోయారు. నియోజకవర్గ ఇన్చార్జులకే ఇప్పటి వరకూ దిక్కులేని పరిస్థితి. ఇక గ్రామ స్థాయి నిర్మాణం సంగతి చెప్పుకోవాల్సిన పని లేదు. ఇలా.. అప్పుడొక పుల్ల.. అప్పుడొక పుల్ల పేర్చుకుంటూ.. జనసేన పార్టీని కొద్ది కొద్దిగా బలోపేతం చేస్తున్న పవన్ కల్యాణ్… సాధారణ రాజకీయ పార్టీల వేగాన్ని మాత్రం అందుకోలేకపోయారు.
ఎన్నికల ముందుకానీ..ఎన్నికల తర్వాత కానీ.. పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడతానని.. చాలా సార్లు పవన్ చెప్పారు. కానీ ఎప్పుడూ పెట్టలేదు. కనీసం ఇతరుల్ని కూడా పెట్టనీయలేదు. ఫలితంగా.. ఫ్యాన్స్ .. ఫ్యాన్స్ లాగే ఉండిపోయారు. వారు జనసేన చోటా నేతలుగా కూడా ఎదగలేదు. కనీసం కార్యకర్తలుగా కూడా కాలేకపోయారు. నిజానికి పవన్ కల్యాణ్‌కు గ్రామ గ్రామాన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్సే.. జనసేన తరపున ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. వారంతా.. తమదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని వందల గ్రామాల్లో జనసేన దిమ్మలు కనిపిస్తూ ఉంటాయి.
కానీ.. ఆ బలాన్ని.. ప్రణాళికా బద్దంగా పార్టీ బలంగా మార్చుకోవడంలో పవన్ కల్యాణ్ సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు.. అనుకున్నట్లుగానే స్థానిక ఎన్నికలు ముంచుకొచ్చాయి. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగినా.. తర్వాత పంచాయతీ.. మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. అంటే.. ప్రతి ఒక్కరు దాదాపుగా ఓటు హక్కు వినియోగించుకుంటారు. జనసేన బలం క్షేత్ర స్థాయిలో తేలిపోయే ఎన్నికలవి. కానీ.. ఇప్పటికి జనసేన పోటీ చేస్తుందా.. లేదా అన్నదానిపై క్లారిటీ లేకుండా పోయింది.