సతీష్ వేగేశ్నకి ఓ స్టైల్ ఉంది. కుటుంబ బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు, భావోద్వేగాలూ.. వీటిపై కథలు రాసుకుంటుంటారు. శతమానం భవతి, శ్రీనివాస కల్యాణంలో అవే కనిపించాయి. అందులో ఒకటి హిట్టు ఇంకోటి ఫ్లాపు. ఈయన మరీ క్లాసీగా పోతున్నాడు అనే విమర్శలూ అందుకున్నాడు. అందుకే ఈసారి తనదైన ఎమోషన్ని పట్టుకుంటూనే, యాక్షన్ రంగరించే ప్రయత్నం చేశాడు. ‘ఎంత మంచివాడవురా’లో.
టైటిల్ వినగానే ఇది పద్ధతైన కథ అనిపిస్తుంది. సతీష్ తన మార్కు మార్చలేదనిపిస్తుంది. అయితే ట్రైలర్ చూస్తే మాత్రం ఆయన మారడానికి కాస్త ప్రయత్నం అయితే చేశారనిపించకమానదు.
“తాతయ్య దగ్గర సూర్య, ఊర్లో శివ, ఈ అమ్మాయి దగ్గర రిషి… ఇలా ఒక్కో చోట ఒక్కో పేరు, ఒక్కో రిలేషన్ మెయిన్టైన్ చేస్తున్నాడు..” – అంటూ ట్రైలర్ ప్రారంభంలోనే హీరో క్యారెక్టరైజైషన్ చెప్పేశారు.
పేరుతో పిలిచేదానికంటే, బంధుత్వంతో పిలిచే దానికే ఎమోషన్ ఎక్కువ అనేది హీరో మాట. ఆ బంధుత్వాల కోసం హీరో ఎంత దూరం వెళ్లాడన్నదే ఈ సినిమా కాన్సెప్టు. అసలు సూర్య, శివ, రుషి ఈ ముగ్గురిలో హీరో ఎవరు? అతని వెనుక ఉన్న నిజమేంటి? అనేదే `ఎంత మంచివాడవురా`కి కోర్ పాయింట్. కథలో, దర్శకుడు ఎంచుకున్న పాయింట్లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. అయితే అంత వరకే ఆగిపోలేదు. ఆ ఊర్లో ఓ విలన్ని ప్రవేశ పెట్టించి – యాక్షన్ కి రంగం సిద్ధం చేశారు. ఆ పాత్రలో రాజీవ్ కనకాల కనిపిస్తున్నాడు. రాజీవ్‌కి ఈమధ్య ఇంత పెద్ద పాత్ర దక్కడం ఇదేనేమో..? వీటిమధ్య అడిగి మరీ ఐలవ్ యూ చెప్పించుకునే విచిత్రమైన పాత్రలో హీరోయిన్ ఎంట్రీ ఇస్తోంది. మధ్యమధ్యలో ఫాదర్ సెంటిమెంటు. చివర్లో నందమూరి హీరోల నుంచి ఆశించే యాక్షనూ కావల్సినంత చూపించారు. “ఇంకోసారి మా నాన్నవైపు వచ్చినా, కన్నెత్తి చూసినా.. నీకూ వాడికీ.. కోసి కారంపెడతా” అన్నట్టు ఓ సింబాలిక్ షాట్ పెట్టారు. దాన్ని బట్టి – యాక్షన్ కూడా పీక్స్ లో ఉంటుందని అర్థం చేసుకోవొచ్చు.
ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమా ఇది. సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ సినిమాలకు ఎంత వెయిటేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండేళ్ల క్రితం సంక్రాంతికి వచ్చిన శతమానం భవతి చిత్రమే పెద్ద ఉదాహరణ. దర్శకుడు సతీష్ వేగేశ్న కూడా అదే నమ్మకంతో ఉన్నాడు.