ఎన్టీఆర్ అంటే.. ఓ ఉత్సాహం, ఉత్ర్పేరకం. వెండి తెరపైనే కాదు, బయట కూడా తన మాటలతో అభిమానులకు స్ఫూర్తిపంచుతుంటాడు. వేదికలపై ఎన్టీఆర్ ఎప్పుడూ చాలా సౌమ్యంగా, అందంగా మాట్లాడుతుంటాడు. తన అన్నయ్య సినిమా వేడుకలకు తరచూ వచ్చే ఎన్టీఆర్.. తన స్పీచులతో కల్యాణ్ సినిమాలకు కావల్సినంత హైప్ ఇస్తుంటాడు. ఈ సంక్రాంతికి కల్యాణ్ రామ్ సినిమా ‘ఎంత మంచివాడవురా’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు అనగానే.. అలాంటి స్పీచులే ఆశించారు. కానీ ఎన్టీఆర్ మాత్రం తన స్పీచుని సింపుల్‌గా తేల్చేశాడు. ఈ సినిమాని మరీ ఎక్కువగా మోయకూడదు అనుకున్నాడో, ఎక్కువ చెప్పి అంచనాలు పెంచకూడదని కామ్‌గా ఉన్నాడో తెలీదు గానీ, తన స్పీచులో మెరుపులేం లేవు. పైగా వేదిక దగ్గర అభిమానుల తోపులాట ఎక్కువగా కనిపించింది. ఎన్టీఆర్ మైకు అందుకోగానే ఫ్యాన్సంతా గోల గోల చేశారు. దాంతో ఎన్టీఆర్ డిస్ట్రబ్ అయినట్టు కనిపించింది. ‘మీరు ఇలానే గోల చేస్తే నేను ఇక్కడ్నుంచి మాట్లాడకుండానే వెళ్లిపోతా’ అని ఎన్టీఆర్ హెచ్చరించడంతో ఫ్యాన్స్ కాస్త తగ్గారు. అయినా సరే, ఎన్టీఆర్ స్సీచ్ మొక్కుబడిగానే సాగింది.
“అన్నయ్య థ్రిల్లర్, కమర్షియల్, మాస్ సినిమాలు ఎక్కువగా చేశారు. కానీ ఓ కుటుంబ కథా చిత్రం చేయలేదని ఎప్పుడూ ఓ వెలితి ఉండేది. ఆ కోరిక వేగేశ్న సతీష్ ద్వారా నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. నిర్మాత కృష్ణ ప్రసాద్ మాకుటుంబానికి కేవలం నిర్మాత మాత్రమే కాదు. ఆయన బాబాయ్‌తో ఎన్నో సినిమాలు చేశారు. మా కుటుంబంలో ఓ సభ్యుడు. ఆయన సమర్పణలో.. అతి పెద్ద మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ నుంచి ఈ సినిమా వస్తోంది. గోపీ సుందర్ మంచి సంగీతం అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహాయ సహకారాలతో ఈ సినిమా తయారైంది.. మంచి మనసుతో మంచి సినిమాల్ని ఆదరించే గొప్ప గుణం మన తెలుగు ప్రేక్షకులందరికీ ఉంది. గొప్ప మనసుతో వీళ్ల ప్రయత్నానికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. మీరంతా మంచి ఆనందంతో ఉన్నారు. ఇదే ఆనందం మీ ఇంటికి వెళ్లి పంచండి. ఇదే ఆనందం మీ కుటుంబ సభ్యులకూ, ఆ తరవాత మాకు పంచండి. ఈ పండక్కి రిలీజ్ అవ్వబోతున్న మిగిలిన సినిమాలు దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో కూడా అద్భుతమైన విజయాలు సాధించి, తెలుగు చిత్రసీమ ముందుకు వెళ్లేలా దోహదపడాలి అని కోరుకుంటున్నా” అంటూ ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ముగించాడు.
మరోవైపు కల్యాణ్‌రామ్‌ని కూడా ఫ్యాన్స్ మాట్లాడనివ్వలేదు. కల్యాణ్ రామ్ మైకు అందుకోగానే గోల మొదలైంది. దాంతో రెండు ముక్కలు మాట్లాడేసి మైకు ఇచ్చేశాడు కల్యాణ్ రామ్. సంక్రాంతి అంటేనే పెద్ద పండగని, ఈ సంక్రాంతికి వస్తున్న మిగిలిన సినిమాలు బాగా ఆడాలని, తన సినిమా ఇంకా బాగా ఆడాలని కోరుకున్నాడు. మొత్తానికి ఫ్యాన్స్ గోల గోల చేయడంతో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ బాగా హర్టయినట్టు అనిపిస్తోంది. సినిమా గురించి చాలా చెప్పాలని వచ్చినవాళ్లు అంతంతమాత్రంగా మాట్లాడి వెనుతిరగాల్సివచ్చింది.