విజయవాడ భగ్గుమంది. బెంజ్ సర్కిల్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అమరావతి జేఏసీ నేతలకు మద్దతుగా చంద్రబాబు ప్రారంభించిన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో.. రగడ ప్రారంభమయింది. ఎంతకీ తెగలేదు. జేఏసీ నేతలు.. ఇతర పార్టీలకు చెందిన నేతలందరూ.. పెద్ద ఎత్తున ఉండటంతో.. పోలీసులు వందల సంఖ్యలో ఆ నేతల్ని చుట్టుముట్టారు. ముందుగు వెళ్లనీయకుండా చేశారు. దాదాపుగా రెండు, మూడు గంటల తోపులాట తర్వాత అందర్నీ.. పోలీసులు వ్యాన్‌లో ఎక్కించగలిగారు. అరెస్ట్ చేస్తున్నామని చెప్పగలిగారు. కానీ.. ఆ వ్యాన్ ముందుకెళ్లే పరిస్థితి లేకపోయింది. నలువైపులా జనం చుట్టుముట్టారు. విజయవాడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అతి కష్టం మీద నేతల్ని ఎక్కిన బస్సును.. తరలించారు.
అమరావతి ఉద్యమంపై పోలీసులు అడుగడుగన ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేయడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. రాజధాని పరిరక్షణ బస్సు యాత్రకు అనుమతి ఇచ్చిన అధికారులు… తర్వాత పోలీసుల జోక్యంతో విరమించుకున్నారు. అనుమతి లేదని పోలీసులు.. జిల్లాల యాత్రకు బయలుదేరిన జేఏసీ నేతల్ని నిలిపివేశారు. ఈ విషయం తెలిసి చంద్రబాబు… విజయవాడలోని జేఏసీ కార్యాలయం నుంచి… బస్సులను నిలిపివేసిన ఆటోనగర్‌కు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించారు. ఇతర పార్టీల నేతలతో కలిసి పాదయాత్రగా బయలుదేరారు. అయితే.. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు ఆ యాత్రను కూడా అడ్డుకున్నారు.
అమరావతి ఉద్యమం విషయంలో ప్రభుత్వం తీవ్రమైన అణచివేతకు పాల్పడుతూండటంతో.. వారి పోరాటం మరింత పెరుగుతోందని కానీ.. తగ్గడం లేదు. రోజు రోజుకు పోలీసు నిర్బందాలు పెరిగిపోతున్నా… అమరావతి జేఏసీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు.. పనిచేస్తున్న పోలీసులు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.