బీసీ కార్పొరేషన్ నిధులు..!
ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులు..!
క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ నిధులు..!
ముస్లిం వేల్ఫేర్ కార్పొరేషన్ నిధులు..!
కాపు కార్పొరేషన్ నిధులు.. ! .. ఇలా ఏపీ సర్కార్.. ఏ ఒక్క దాన్ని వదిలి పెట్టలేదు. అన్నింటికి బడ్జెట్లో కేటాయించిన సొమ్ములను మొత్తం.. అమ్మఒడి ఖాతాకు బదిలీ చేయించేసింది. నిజానికి ఆయా కార్పొరేషన్లకు ప్రభుత్వం ఇప్పటి వరకూ కేటాయించిందేమీ లేదు. కానీ.. రాత్రికి రాత్రికి కేటాయించి… అదే రాత్రికి రాత్రి.. వాటిని.. అమ్మఒడి ఖాతాకు బదిలీ చేస్తున్నట్లుగా సృష్టించారు. దీంతో విస్తుపోవడం జనాల వంతు అయింది.
బలహీనవర్గాల స్వయం ఉపాధిపై బండ వేసిన జగన్ సర్కార్ ..!
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సాయం చేసేందుకు ప్రభుత్వాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాయి. వాటికి నిధులు కేటాయించి.. వాటి ద్వారా.. ఆయా వర్గాల్లో సాయం అవసరమైన వారికి అందిస్తారు. స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఏ వర్గానికి ఆ సాయం అందే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే.. బీసీ కార్పొరేషన్ నుంచి ఏకంగా.. రూ.3,432 కోట్లు, కాపు కార్పొరేషన్ ద్వారా రూ.568 కోట్లు , ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించిన రూ.1,271 కోట్లు, మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించాల్సిన రూ.442 ఎస్టీలవి.. రూ.395 కోట్లు తరలించేశారు. ఇక నుంచి కాపు, బీసీ, ట్రైబల్ … ఇతర సంక్షేమ కార్పొరేషన్లకి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ సాయం కోసం.. ఎవరికీ సాయం చేయలేరు. అంటే ఆయా కార్పొరేషన్లన్నీ నిర్వీర్యం అయినట్లే.
బడ్జెట్లో అమ్మఒడికి కేటాయించిన నిధులేమయ్యాయి..?
నిజానికి బడ్జెట్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అమ్మఒడి పథకానికి నిధులు కేటాయించారు. రూ. 6,455 కోట్లు దీని కోసం కేటాయింపులు చూపారు. ఈ సొమ్ము అంతా బడ్జెట్ కేటాయింపే. ఆయా కార్పొరేషన్లకు.. బడ్జెట్లో నిధులు కేటాయించారు. కానీ ఇప్పుడు అమ్మఒడికి కేటాయించినవి.. కార్పరేషన్లకు కేటాయించినవి .. ఒక్క కేటాయింపుగానే చూపే ప్రయత్నంలో.. ఈ మళ్లింపు జీవోలు జారీ అయ్యాయి. ప్రభుత్వం అతి పెద్ద గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతోందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది. అమ్మఒడికి నేరుగా బడ్జెట్ కేటాయింపులు చేసిన ప్రభుత్వం.. ఆ మేరకు ఎందుకు విడుదల చేయలేకపోయిందన్న ప్రశ్న మౌలికంగా వస్తోంది. బడుగు, బలహీనవర్గాలను ఆర్థికంగా ఎదిగేలా చేయడానికి ఉపయోగపడాల్సిన సొమ్మును ఎందుకు తరలిస్తున్నారనేది.. అంతుబట్టని విషయం.
మరో రత్నం విషయంలో మళ్లీ.. మళ్లీ మాట తప్పినట్లే..!
అమ్మఒడి పథకం ఓ గొప్ప రత్నంగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నారు. కానీ అది బడుగు, బలహీవర్గాలకు అందే.. కొద్దిపాటి సాయం అందకుండా చేసే.. నకిలీ రత్నంగా మారిపోయిన పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే.. ఇంటర్మీడియట్ పిల్లలతో కలిసి కనీసం ఎనభై లక్షల మంది తల్లులకు సాయం అందుతుందని అనుకున్నారు. కానీ ఆ సంఖ్యను సగానికి సగం కుదించారు. ఒకప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలన్నారు కానీ.. ఇప్పుడు.. తమ దగ్గర ఉన్న సొమ్ముకు తగ్గట్లుగా.. లబ్దిదారులను కుదించారు. చివరికి ఎంత మందికి ఇస్తారో కూడా తెలియని పరిస్థితి. అటు బడుగుల సొమ్ము ఊడ్చేసి.. ఇటు.. తల్లులలకూ సరైన న్యాయం చేయలేకపోతే.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగడం ఖాయం.