మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ..జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా మారడం లాంఛనం అయ్యే పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయనను ఆ కేసుల్లో నిందితుడిగా నమోదు చేసిన అభియోగాలను స్వీకరించాలని.. సీబీఐ… ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేసింది. నిజానికి.. ధర్మాన .. జగన్ క్విడ్ ప్రో కోకు సహకరిస్తూ.. అక్రమంగా భూకేటాయింపులు చేశారని.. గతంలోనే.. సీబీఐ కేసు పెట్టింది.కానీ అప్పట్లో కిరణ్ సర్కార్.. మంత్రిగా ఉన్నందున ధర్మాన విచారణకు అనుమతి ఇవ్వలేదు. సాంకేతిక కారణాలతో ధర్మాన.. ఆ కేసు నుంచి ఇప్పటి వరకూ రిలీఫ్ పొందారు.
మంత్రి పదవి పోయిన తర్వాత ధర్మానను నిందితుడిగా చేర్చి.. అభియోగాలను విచారణకు స్వీకరించేలా చేయడానికి సీబీఐ చేసిన ప్రయత్నాలను ధర్మాన కొన్ని పిటిషన్లతో అడ్డుకున్నారు. ఇప్పుడా పిటిషన్ల అడ్డు కూడా తొలగిపోయింది. అభియోగాలను విచారణకు స్వీకరించడంపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ప్రస్తుతం ధర్మాన మంత్రిగా లేరు కాబట్టి.. ఆయన విచారణకు అనుమతి అవసరం లేదని.. అభియోగాలను.. విచారణకు స్వీకరించాలని.. సీబీఐ.. కోర్టుకు తెలిపింది. ధర్మానను నిందితుడిగా చేరుస్తూ.. శుక్రవారం సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
ఇక నిందితుడిగా ప్రతి శుక్రవారం.. ధర్మాన జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలతో పాటు.. కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ శుక్రవారం… జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ.. కోర్టుకు హాజరు కావాల్సిందేనని.. సీబీఐ కోర్టు గత వారం.. స్పష్టం చేసింది. అయితే.. జగన్మోహన్ రెడ్డి హాజరుపై ఇప్పటి వరకూ.. ప్రభుత్వం కానీ.. వైసీపీ కానీ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. ఒక వేళ ఆయన కోర్టుకు హాజరు కాకపోతే ఉద్దేశపూర్వకంగానే డుమ్మాకొట్టినట్లు భావించాల్సి ఉంటుందని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.