అమరావతి విషయంలో భారతీయ జనతా పార్టీ విధానం ఏమిటన్నది గందరగోళంగా మారింది. ఓ వైపు జీవీఎల్ నరసింహారావు .. తాను చెప్పిందే రైట్ అని .. బీజేపీలో ఇక ఎవరు మాట్లాడినా.. అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనని తేల్చేస్తున్నారు. మరో వైపు సుజనా చౌదరి లాంటి వాళ్లు.. జీవీఎల్‌కు ఏపీతో సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అధికార ప్రతినిధులు బీజేపీలో చాలా మంది ఉన్నారని.. ఆయన తనకు అప్పగించిన పనులు చూసుకుంటే చాలంటున్నారు. మరో వైపు.. కన్నా లక్ష్మినారాయణ.. రాజధాని కోసం దూకుడుగా మాట్లాడుతున్నారు. పోరాడుతున్నారు. అమరావతి అందరిదీ అని.. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి కానీ పాలనా వికేంద్రీకరణ కాదని.. చెబుతున్నారు. దీనిపై.. గతంలో.. ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్ గా వ్యవహరించిన సిద్ధార్థ నాథ్ సింగ్ స్పష్టత ఇచ్చారు. కన్నా చెప్పిన అభిప్రాయమే బీజేపీ అభిప్రాయమన్నారు. ఇందులో మరో మాటకు తావు లేదన్నారు.
గతంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగకుముందు సిద్ధార్థ నాథ్ సింగ్ ఏపీ బీజేపీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో ఆయనకు మంత్రి పదవి లభించింది. ఆ తర్వాత ఆయన ఏపీకి సమయం కేటాయించలేకపోయారు. ఇప్పుడు పౌరసత్వ చట్ట సవరణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏపీకి వచ్చిన ఆయన.. జగన్ సర్కార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 75 జిల్లాల యూపీకి ఒకే రాజధాని ఉందని.. అలాంటిది 13 జిల్లాల ఏపీకి మూడు రాజధానులు ఎందుకని ప్రశ్నించారు. పరిపాలించడం చేతకాకపోతే.. తమ దగ్గరకు వస్తే.. ట్రైనింగ్ ఇస్తామని కూడా వెటకారం చేశారు.
భారతీయ జనతా పార్టీలో.. రెండు వర్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడేవారు .. ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా… సమర్థించేవారు అయితే… ప్రజాకోణంలో … ప్రతిపక్షంగా వ్యవహరించడానికి ప్రయత్నించేవారు మరికొందరు. అయితే.. జగన్‌కు మద్దతుగా ఉండేవారు చాలా పరిమితంగా ఉన్నారు. జీవీఎల్, సోము వీర్రాజు వంటి వారు మాత్రమే.. వాయిస్ వినిపిస్తున్నారు. మిగతా అందరూ.. కన్నా వాదననే సమర్థిస్తున్నారు. దీంతో..మెజార్టీ నేతల అభిప్రాయాలను బీజేపీ హైకమాండ్ పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నారు. అయితే.. ఈ విషయంలో.. బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా.. లేదా అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు.