అమరావతి పర్యటనలో ఓ రోజు చంద్రబాబు వెళ్లారు. కొంత మంది రాళ్లు, చెప్పులు వేశారు. ఈ ఘటన జరిగిన అరగంటలోనే.. డీజీపీ గౌతం సవాంగ్ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని.. వారు అదే చేశారని.. గొప్పగా చెప్పుకొచ్చారు. ఆ మాటలే ఇప్పుడు.. రోజుకు వంద సార్లు.. డీజీపీ సవాంగ్‌కు గుర్తు చేస్తున్నారు రాజధాని రైతులు.. ఇతర పార్టీల నేతలు. చంద్రబాబుపై రాళ్లు, చెప్పులు వేయడానికి అనుమతించే నిరసనలు.. తాము ప్రజాస్వామ్య బద్దంగా చేసుకుంటామంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. చెప్పులు, రాళ్లు వేయడాన్ని నేరం కాదని.. నిరసనగా చెప్పిన డీజీపీ… అదే తమ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ.. మహిళలు… పిల్లల్ని.. వేధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
అమరావతి ఉద్యమంలో ప్రతీ రోజూ.. వందల మందిపై కేసులు పెడుతున్నారు. రహదారి దిగ్భంధం విషయంలో ఏడు వందల మందిపై కేసులు పెట్టారు. అమరావతి జేఏసీ నేత అనిపించుకున్న ప్రతి ఒక్కర్ని.. పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఓ కేసు పెడుతున్నారు. అమరావతి గ్రామాల్లో ఎక్కడా నిరసనకు అవకాశం ఇవ్వడం లేదు. టెంట్లు కూడా వేయనివ్వడం లేదు. చివరికి బస్సుయాత్రకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ నిలివేశారు. ఉద్యమిస్తున్న మహిళలపై… కూడా పోలీసులు అరాచకానికి పాల్పడుతున్నారు.
ప్రభుత్వానికే పోలీసులు … ప్రజలకు పోలీసులు కాదన్నట్లుగా… డీజీపీ తీరు ఉండటం.. ఇతర పార్టీలు.. ప్రజాసంఘాల నేతల్ని ఆగ్రహానికి గురి చేస్తోంది. నిరసనల విషయంలో గతంలో డీజీపీ చేసిన వ్యాఖ్యల్ని.. వారు తమ ఫోన్లలో పోలీసుల ముందు ప్రదర్శిస్తున్నారు. తమ నిరసనలకు అడ్డు రావొద్దని కోరుతున్నారు. ఈ విషయం లో డీజీపీ కూడా.. పరిస్థితుల్ని సమర్థించుకోలేని పరిస్థితి ఉంది. గౌతం సవాంగ్ .. గతంలో సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ఆయన చర్యలు మాత్రం వివాదాస్పదమవుతున్నాయి. ప్రభుత్వం చెప్పినట్లు చేయడం తన విధి అని ఆయన తనను సమర్థించుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు.