ప్రేమ కథ ఎప్పుడూ ఎవర్ గ్రీనే. పాత, కొత్త అంటూ ప్రేమలో ఉండదు. అది తీసే విధానంలోనే ఉంటుంది. అందుకే ప్రేమకథలు ఎప్పుడూ పుట్టుకొస్తూనే ఉంటాయి. ప్రేమించుకోవడం – పెళ్లి చేసుకోవడం, ప్రేమించుకోడం- గొడవలు పడడం – అంతలోనే కలుసుకోవడం, పెద్దల్ని ఎదిరించే ప్రేమ, కులాన్ని, మతాన్నీ, అడ్డుగోడల్నీ దాటుకొచ్చే ప్రేమ – ఇవన్నీ చూశాం. చూస్తూనేఉన్నాం. ఇద్దరు పాత ప్రేమికులు మళ్లీ కలుసుకుంటే, వాళ్ల మధ్య ఓ జర్నీ జరిగితే, వాళ్లిద్దరూ తమ పాత గొడవల్నీ, జ్ఞాపకాల్నీ, ప్రేమనీ గుర్తు తెచ్చుకుంటే – ఇంత అందమైన ఆలోచన నుంచి `96` అనే ప్రేమకథ పుట్టుకొచ్చింది. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. అక్కడ ఈ సినిమాని క్లాసిక్ అన్నారు. ఇప్పుడు అదే కథ తెలుగులో `జానూ` పేరుతో రీమేక్ అవుతోంది. శర్వానంద్, సమంత జంటగా నటించారు.
తమిళంలో విజయ్‌సేతుపతి – త్రిష జంటగా నటించిన సినిమా ఇది. వాళ్లిద్దరి జంట, కెమిస్ట్రీ `96` సూపర్ హిట్లో కీలక పాత్ర పోషించాయి. మళ్లీ ఆ మ్యాజిక్‌ని శర్వా, సమంతలు రిపీట్ చేస్తారా? అనే సందేహాల్ని టీజర్ పటాపంచలు చేసేసింది. కథలోని భావోద్వేగాల్ని, పాత్రల మధ్య సంఘర్షణనీ టీజర్లోనే బలంగా చూపించారు. నేపథ్య సంగీతం మనసుల్ని మెలిపెట్టింది. చివర్లో సమంత శర్వాని పట్టుకుని ఏడుస్తున్న షాట్ – తప్పకుండా కదిలిస్తుంది. సమంత, శర్వాలకు ఇవి రెండూ బరువైన పాత్రలే. భావోద్వేగభరితమైన ప్రేమకథల్ని చూసి చాలాకాలం అయ్యింది. ఇప్పటి ప్రేమల్లో క్రష్ తప్ప ఇంకేం లేదు. వీటి మధ్య 96 తప్పకుండా రిఫ్రెష్‌గా ఉండబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.