విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అని.. అది ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో సాయపడుతుందని.. వైసీపీ చేస్తున్న ప్రచారం నేపధ్యంలో.. అమరావతి పరిరక్షణ సమితి.. అక్కడ్నుంచి .. రాజధానికి మద్దతు పొందాలని నిర్ణయించుకుంది. రాజధాని రైతులతో కూడిన అమరావతి పరిరక్షణ సమితి శ్రీకాకుళం జిల్లా నుంచే అమరావతి పరిరక్షణయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. మామూలుగా బుధవారం బయలుదేరాల్సిన బస్సులను.. పోలీసులు అడ్డుకున్నారు. కానీ.. నేడు అనుమతి ఇవ్వక తప్పలేదు. ఆ యాత్రలో స్వయంగా పాల్గొనాలని చంద్రబాబు కూడా నిర్ణయించుకున్నారు.
అమరావతిని కాదని.. విశాఖలో రాజధాని పెట్టడం వల్ల.. విశాఖలోనే పెద్దగా పాజిటివ్ వేవ్‌ని వైసీపీ చూడలేకపోయింది. ఇతర పార్టీల నేతలు సానుకూలంగా స్పందించారు కానీ.. భయాందోళనలు లేని తరలింపు కావాలని కోరుతున్నారు. ఎవరూ అడగని ప్రాంతానికి ముఖ్యమంత్రి జగన్ రాజధాని తీసుకొస్తున్నారంటేనే.. ఏదో గూడు పుఠాణి ఉందనే చర్చ సామాన్యుల్లో జరుగుతోంది. అందే.. వైసీపీ నేతలు.. ఈ ప్రతిపాదనలను.. గట్టిగా సమర్థించినా.. జనంలో అంత ఎమోషన్ లేకపోవడం చూసి.. భయాందోళనల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. విశాఖపట్నంలోనే ఇలా ఉంటే.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉండే స్పందనను.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని.. ఇతర పార్టీల నేతలంటున్నారు.
విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గురించి స్పీకర్ తమ్మినేని సీతారం లాంటి నేతలు… ఉత్తరాంధ్రకు.. శ్రీకాకుళానికి ఏదో మేలు జరగబోతోందని.. దాన్ని చంద్రబాబు.. అమరావతి ఉద్యమం ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు కానీ.. పెద్దగా సత్ఫలితాలు ఇచ్చినట్లుగా లేదు. విశాఖ రాజధాని వల్ల శ్రీకాకుళానికి ఏమిటీ ప్రయోజనం అనే చర్చ జరుగుతోంది. విజయనగరంలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. ఇప్పుడు వారి మద్దతు పొందడానికి అమరావతి రైతులు బస్సుయాత్రను అక్కడి నుంచేప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అక్కడ అనూహ్యమైన మద్దతు రైతులకు లభిస్తే.. అధికార పార్టీకి ఇబ్బందికరమే.