ఎంత పెద్ద స్టార్ అయినా సరే, మీడియా ముందు కాస్త ఆచితూచి మాట్లాడతారు. ఏం మాట్లాడితే, ఏం వస్తుందో అనే భయం ఉంటుంది. కానీ మహేష్‌బాబు అలా కాదు. మీడియాపైనే సెటైర్లు వేసేశాడు. మహేష్ ఎప్పుడూ అంతే. చిన్నచిన్నగా చురక అంటిస్తుంటాడు. ఆయనతో పనిచేసేవాళ్లంతా ఈ విషయం చెబుతూనే ఉంటారు. ఇప్పుడు మీడియాకీ అది రుచి చూపించాడు.
మహేష్ ఇంటర్వ్యూలు ఈరోజు మధ్యాహ్నం అన్నపూర్ణ స్డూడియోలో జరిగాయి. ఈ ఇంటర్వ్యూలలో మహేష్ ఫుల్ స్వింగ్‌లో కనిపించాడు. ఫొటో గ్రాఫర్ల కోసం ఒక్క నిమిషం కూడా నిలబడలేదు. ‘కావాలంటే కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఫొటోలు తీసుకోండి’ అని మొహంమీదే చెప్పేశాడు. దాంతో ఫొటోగ్రాఫర్లంతా మహేష్‌పై కినుక వహించారు.
ఆ తరవాత రిపోర్టర్లపైనా తన ఝలక్ చూపించాడు. ‘ప్రొడక్షన్లో పార్టనర్ షిప్ తీసుకున్నారు కదా.. ఇక ముందూ కొనసాగిస్తారా’ అని అడిగితే ‘ఏం చేయకూడదా’ అంటూ సెటైర్ వేశాడు. ‘రష్మికతో పనిచేశారు కదా ఎలా అనిపించింది’ అని అడిగితే.. ‘ఇదిగో ఈ ప్రశ్నే వేయలేదేంటా? అని ఎదురుచూస్తున్నా? ఎలా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ మార్చుకోరా’ అంటూ మళ్లీ కెలికేశాడు మహేష్. `పెద్ద హీరోలంతా కూర్చుని మాట్లాడుకుంటే రిలీజ్ డేట్ సమస్యలు ఉండవు కదా` అని ఓ పాత్రికేయుడు అడిగితే.. మీ పేపర్లో మంచి ఆర్టికల్ రాయండి అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. దాదాపు ప్రతీ ప్రశ్నకీ ఇలానే సెటైరికల్‌గా సమాధానం చెబుతూ వచ్చాడు మహేష్. దాంతో ఖంగుతినడం పాత్రికేయుల వంతు అయ్యింది.