దక్షిణాదిన అత్యంత పారితోషికం తీసుకునే కథానాయికల్లో నయనతార పేరు ముందే ఉంటుంది. తెలుగులో ఆమె ఎక్కువగా కనిపించకపోవడానికి కారణం.. ఆమె పారితోషికమే. బాలయ్య లాంటి వాళ్లు పట్టుబట్టీ మరీ పిలిచి, అడిగినంత పారితోషికం ఇప్పించి మరీ ప్రోత్సహిస్తుంటారు. కొన్ని పాత్రలకు నయనతారకు మించిన ఆప్షన్లు లేకపోవడంతో ఆమె డిమాండ్ చేసినంత ఇచ్చుకోవాల్సిందే. ‘దర్బార్’లోనూ నయనతార నటించింది. అది రజనీకాంత్ సినిమా. పైగా మురుగదాస్ దర్శకుడు. అయినా నయన ఏమాత్రం తగ్గలేదు. ఏకంగా రూ.5 కోట్ల పారితోషికం అందుకుంది. అలాగని రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్ర కాదు. మహా అయితే ఆరేడు సన్నివేశాల్లో కనిపించిందంతే. పెద్దగా డైలాగులు కూడా లేవు. రజనీతో కలసి ఓ పాటలో స్టెప్పులేసిందంతే. ఈ మాత్రం దానికి రూ.5 కోట్లు తీసుకుందంటే ఆమె డిమాండ్ ఏ పాటిదో అర్థం అవుతోంది. నిజానికి మురుగదాస్ సినిమాల్లో కథానాయికల పాత్రలు పటిష్టంగా ఉంటాయి. పైగా నయనతార లాంటి స్టార్ హీరోయిన్ దొరికినప్పుడు అందుకు తగిన పాత్ర రాసుకుంటాడని అనుకుంటారు. కానీ మురుగదాస్ ఈసారి లెక్క తప్పాడు.