ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణకు పొడిగింపు దక్కడం లేదని ఢిల్లీ వర్గాలు స్పష్టమైన సమాచారాన్ని రాష్ట్ర నేతలకు పంపాయి. కన్నా లక్ష్మినారాయణ తనను.. రెండో సారి కొనసాగించాలని.. తనకు మద్దతుగా ఉన్న నేతలతో గట్టి ప్రయత్నాలే చేసుకుంటున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం.. కన్నా విషయంలో అంత ఆసక్తిగా లేదని చెబుతున్నారు. యువ నాయకుడు, ఎమ్మెల్సీ మాధవ్ వైపు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. ధాటిగా.. పార్టీ స్టాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లగల.. వాగ్ధాటి మాధవ్‌కు ఉంది. ఆయన కుటుంబం మొదటి నుంచి ఆరెస్సెస్, బీజేపీ సానుభూతిపరులుగా ఉన్నారు. మాధవ్ తండ్రి బీజేపీ మాజీ ఎంపీ కూడా. అదే సమయంలో.. ఆయన పార్టీలో ఎలాంటి గ్రూపుల్ని మెయిన్‌టెయిన్ చేయరు. తమకు కావాలని అడిగేవారే తప్ప… మాధవ్‌కు ఇస్తే.. వ్యతిరేకత వ్యక్తం చేసేవాళ్లు పెద్దగా ఉండరని భావిస్తున్నారు.
అదే సమయంలో.. సామాజిక సమీకరణాల ప్రకారం చూసుకోవాలంటే.. ఈ సారి కమ్మ సామాజికవర్గానికి ఇచ్చే అంశాన్ని బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ తన పురందేశ్వరి పేరు బాగా ప్రచారంలోకి వస్తోంది. బీజేపీ సంస్థాగత ఎన్నికలను దగ్గరగా పరిశీలించే వ్యక్తులు.. పోటీ పురందేశ్వరి, మాధవ్ మధ్యే ఉందని.. ఇద్దరిలో ఒకరిని.. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఖరారు చేస్తామని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. పురందేశ్వరిని అధ్యక్షురాలిగా నియమిస్తే.. టీడీపీకి ప్రత్యామ్నాయం అవ్వాలనుకుంటున్నామన్న సందేశాన్ని ప్రజలకు పంపినట్లవుతుందని అంచనా వేస్తున్నారు.
కన్నా లక్ష్మినారాయణ ఈ సారి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోతే.. ఆయన పూర్తిగా సైడయిపోయే పరిస్థితి వస్తుందనే ఆందోళన ఆయన వర్గీయుల్లో ఉంది. ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరిపోయేందుకు సిద్ధమయ్యారు. కానీ.. చివరి క్షణంలో అమిత్ షా పట్టుబట్టడంతో .. ఆస్పత్రిలో చేరి… వైసీపీలో చేరే ఎపిసోడ్‌కు ముగింపునిచ్చారు. ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టారు. అప్పుడు వైసీపీలో చేరి ఉంటే.. కన్నా.. ఇప్పుడు మంత్రిగా ఉండేవారని.. ఆయన అభిమానులు .. ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు.