రాజధాని విషయంలో.. ఉత్తరాంధ్రలో ఓ ఎమోషన్ ఉందని.. దాన్ని చంద్రబాబును తిట్టడం ద్వారానే.. హైలెట్ చేయవచ్చని.. వైసీపీ నేత తమ్మినేని సీతారాం గట్టిగా భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో అలాంటి వ్యూహాన్ని అమలు చేసే సమర్థులైన వైసీపీ నేతలు ఆయనకు కనిపించినట్లుగా లేరు. అందుకే.. తానే స్వయంగా.. తన రాజ్యాంగబద్ధ హోదాను పక్కన పెట్టేసి.. మైక్ అందుకుంటున్నారు. దాదాపుగా ప్రతీ రోజు.. శ్రీకాకుళంలో చంద్రబాబును చెడామడా తిట్టేస్తున్నారు. చంద్రబాబు ఓ మనిషా.. అని స్టార్ట్ చేసి.. అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులుగా అవమానకరంగా మాట్లాడేస్తున్నారు. అదే సమయంలో.. తమ ఉత్తరాంధ్ర ఆకలితో అలమటిస్తున్నదని.. జగన్ అన్నం పెట్టాలని చూస్తూంటే.. చంద్రబాబు తన్నేస్తున్నాడని.. సెంటిమెంట్ పెంచేందుకు తన వంతు సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేనా.. టీడీపీ నేతల్ని రెచ్చగొట్టేందుకు.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలవి ఒక బతుకులేనా అంటూ.. హేళన చేస్తున్నారు.
తమ్మినేని సీతారం.. ఓ రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నారు. స్పీకర్‌గా ఆయన పార్టీలకు .. కుల, మత , ప్రాంత రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ సీతారాం మాత్రం.. వాటన్నింటినీ.. మొదటి నుంచి పరిగణనలోకి తీసుకోవడం లేదు. అసలు ఈ విశాఖ రాజధాని అంశం రాక ముందు నుంచే ఆయన చంద్రబాబుపై బూతులు లంకించుకుంటున్నారు. అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబు బట్టలూడదీస్తామని… ఆయన వ్యాఖ్యానించారు. ఫలితంగా.. ఆయనపై… కూడా.. టీడీపీ నేతలు అదే రేంజ్లో ఫైరయ్యారు. చివరికి స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని కూడా ఆయన కాపాడలేకపోతున్నారన్న విమర్శలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.
తమ్మినేని వ్యాఖ్యలను.. ఆయన సమీప బంధువు.. ఆముదాల వలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్.. సెటైరిక్‌గా ఎప్పటికిప్పుడు తిప్పికొడుతున్నారు. ఆయన పోతరాజులాగ… బయటకు వచ్చి.. తనను తాను కొట్టుకుంటున్నారని… విమర్శిస్తున్నారు. తమ్మినేనికి శ్రీకాకుళంపై.. ఉత్తరాంధ్రపై అంత అభిమానం ఉంటే… ఆముదాల వలసలో సెక్రటేరియట్ పెట్టించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. స్పీకర్ తమ్మినేని మాత్రం.. రివర్స్‌లో వచ్చే సవాళ్లను పట్టించుకోవడం లేదు. తన దారిలో తాను వెళ్తున్నారు. అందుకే్.. తమ్మినేని స్పీకర్ గా కంటే..అధికార ప్రతినిధిగానే తన బాధ్యతలు ఎక్కువగా నిర్వహిస్తున్నారని.. జనం సెటైర్లు వేస్తున్నారు.