తెలుగు తెరపై మరో క్రేజీ కాంబినేషన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – బాహుబలి ప్రభాస్ కలిసి పనిచేయబోతున్నారు. అవును.. అన్నీ కుదిరితే ఈ యేడాదే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే దీనికి చాలా సమీకరణాలు కలిసిరావాలి.
ఒకటి… అల వైకుంఠపురం హిట్ అవ్వాలి. కనీసం మంచి టాక్‌తో సాగి, సంక్రాంతి సీజన్‌కి తగిన వసూళ్లు రాబట్టుకుంటే చాలు. రెండోది ‘జాన్’ మేలోగా పూర్తవ్వాలి. ఇవి రెండూ జరిగితే మాత్రం ఈ కాంబినేషన్‌ని చూడొచ్చు. ప్రభాస్ తో పనిచేయాలని, త్రివిక్రమ్… త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయాలని ప్రభాస్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ‘జాన్’ తరవాత ప్రభాస్ సినిమా ఏమిటన్న విషయంలో ఇంకా ఓ క్లారిటీ లేదు. శంకర్ కాంబినేషన్లో ఓసినిమా వస్తోందని చెబుతున్నా – అది ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంతో చెప్పలేం. ప్రభాస్ కూడా.. యాక్షన్‌తో పనిలేకుండా, పాన్ ఇండియా లాంటి గొడవలు లేకుండా ఓ కంప్లీట్ ఫ్యామిలీ సినిమా చేయాలనుకుంటున్నాడు. దానికి త్రివిక్రమ్ అయితేనే బాగుంటుంది. పైగా ‘అల.. వైకుంఠపురములో’ తరవాత త్రివిక్రమ్ ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వలేదు. ప్రభాస్‌కి సరిపోయే లైన్ త్రివిక్రమ్ దగ్గర ఉంది. అయితే ఇప్పటి వరకూ ఇద్దరి మధ్య భేటీ ఏమీ జరగలేదు. కాకపోతే.. వీరిద్దరినీ కలిపి కూర్చోబెట్టే బాధ్యతని ఓ పెద్ద నిర్మాత తీసుకున్నాడు. ఆ మీటింగ్ సంక్రాంతి అయ్యాకే ఉండబోతోంది. ఆ తరవాతే… ఈ కాంబినేషన్‌పై ఓ క్లారిటీ వస్తుంది.