మహిళలు ఏం చేశారని పోలీసులు విరుచుకుపడ్డారు..?
అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వెళ్తున్నా లాఠీ ఎందుకు ఝళిపించారు..?
ఎప్పుడూ లేని కశ్మీర్ తరహా పరిస్థితిని రాజధాని గ్రామాల్లో ఎందుకు సృష్టించారు..?
అన్నింటికీ ఒక్కటే సమాధానం కనిపిస్తోంది. అదే ప్రభుత్వాధినేత.. పరువు కాపాడటం. ఆయన గురించి ఎక్కువగా మీడియాలో రాకుండా ఉండటం. ఆయన కేసుల గురించి చర్చ జరగకుండా ఉండటం. జడ్జి ఇచ్చే ఆదేశాల గురించి ఎక్కడా పెద్దగా వినపడకుండా ఉండటం. వెళ్లినట్లుగా.. వచ్చినట్లుగా ఎవరూ పట్టించుకోకుండా ఉండటం..!
అనుకూల మీడియాలో రాలేదు.. ప్రతికూల మీడియాకు మహిళలపై ఎటాక్ కవరేజ్..!
కోర్టులో నిందితుడిగా.. అదీ అక్రమాస్తుల కేసులో బోనులో నిలబడబోతున్నారు. దానికి వీలైనంత వరకూ.. ప్రచారం రాకుండా.. మహిళల్ని కుళ్ల బొడిచి అయినా.. దృష్టి మళ్లించే ప్రయత్నం చేయడమేనన్న చర్చ జరుగుతోంది. ఈ ప్రయోగం.. చాలా పకడ్బందీగా పోలీసులు అమలు చేశారు. మీడియా అనుసరించింది. ఫలితంగా.. ముఖ్యమంత్రిగా ఉండి.. నిందితుడిగా కోర్టు బోనెక్కేశారు.. రెండు గంటలు ఉండి.. దిగేసి.. మళ్లీ అమరావతి బయలుదేరి వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ నైతిక పరంగా జరగాల్సినంత చర్చ కానీ.. కేసులపై రాజకీయ పరంగా వెల్లువెత్తాల్సిన విమర్శలు కూడా.. కనిపించలేదు. దీని కోసమే ప్రభుత్వం చాలా పకడ్బందీగా మహిళలని చూడకుండా.. వారిపై దాడికి తెగబడిందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
మీడియా డైవర్షన్ కోసం మహిళలపై ఎటాక్..!
ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ నిందితుడిగా కోర్టు బోనెక్కారు. ఇది నైతిక విలువలకు సంబంధించిన అంశం. అవినీతి కేసులో కోర్టుకు నిందితుడిగా హాజరయ్యే వ్యక్తికి ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత ఉందా లేదా..అన్నది ముఖ్యం. కానీ ఈ అంశం ఈ రోజు చర్చకు రాలేదు. మామూలుగా అయితే.. మీడియా.. సోషల్ మీడియా జగన్ తీరుతో పాటు.. పాత కేసులను బయటకు తీసి హోరెత్తించేవి. కానీ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వాటిని ఎలా మళ్లించాలో తెలుసు. ఆయన చేతిలో ఇప్పుడు పోలీసులు కూడా ఉన్నారు. అంతే.. ప్రణాళిక సిద్ధమైపోయిందని.. రాజధాని మహిళలపై పోలీసులు విరుచుకుపడితే.. తన కోర్టు గురించి మీడియా పట్టించుకోదని ఆయనకు అర్థమైపోయిందంటున్నారు. అందుకే.. పక్కా స్క్రిప్ట్‌తోనే మహిళలపై దాడులకు పోలీసులు తెగబడ్డారని అంటున్నారు.
పెన్నా అనుబంధ చార్జిషీట్‌తో మళ్లీ ఇరుక్కుపోయిన జగన్ ..?
జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవడమే కాదు.. కేసులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. నాలుగేళ్ల క్రితం.. సీబీఐ కోర్టులో ఫైల్ చేసిన పెన్నా అనుబంధచార్జిషీట్ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ చార్డిషీట్ను కొట్టివేయాలని జగన్ తో పాటు ఇతరులు పెట్టుకున్న పిటిషన్లను కోర్టు కొట్టి వేసింది. ఈ చార్జిషీట్‌పై విచారణ కోసం వచ్చే శుక్రవారం.. హాజరు కావాలని జగన్‌తో పాటు ఇతర నిందితుల్ని కోర్టు ఆదేశించింది. పెన్నాకు గనుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడిన అభియోగాలు ఎదుర్కొంటున్న ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, రెవెన్యూ శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శామ్యూల్, మైనింగ్ శాఖ మాజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్, అనంతపురం జిల్లా అప్పటి డీఆర్వో సుదర్శనరెడ్డి, యాడికి ఎమ్మార్వో ఎల్లమ్మ కూడా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 2008లో తాండూరులో 1021 ఎకరాల మైనింగ్ లీజులను పునరుద్ధరించాలని వాల్చంద్ కంపెనీ దరఖాస్తు చేసుకోగా కుదరదని చెప్పిన వైఎస్ ప్రభుత్వం… వాల్చంద్ కంపెనీని పెన్నా సిమెంట్స్ కొనుగోలు చేయగానే తాండూరు మైనింగ్ లీజులను పునరుద్ధరించింది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా గనులు కేటాయించారు. ఫలితంగా.. పెన్నా జగనా కంపెనీల్లో రూ.68 కోట్ల పెట్టుబడులు పెట్టింది.
ఈ వ్యవహారం అంతా చర్చనీయాంశం కాకుండా ఉండేందుకే.. మహిళలపై.. దాడులకు అధికారపార్టీ పులికొల్పిందనే ప్రచారం జరుగుతోంది. దీని వెనుక నిజం ఉన్నా బయటకు రాదు. రాజకీయ వికృత మనస్థత్వం ఉన్న నేతలు .. ఉన్నత పదవుల్లో ఉంటే.. ఎలాంటి పరిణామాలైనా జరిగే ప్రమాదం ఉంటుంది.