తెలుగు360 రేటింగ్ 3/5
ఇప్పుడు మన దగ్గర రెండు ఆప్షన్లున్నాయి.
ఒకటి డ్యూటీ
రెండు మోరల్..
– ‘సరిలేరు నీకెవ్వరు’లో మురళీ శర్మ డైలాగ్ ఇది.
మహేష్‌బాబు రెండోది ఎంచుకుంటాడు.
సూపర్ స్టార్‌తో సినిమా తీస్తున్నప్పుడు కూడా ఏ దర్శకుడికైనా రెండు ఆప్షన్లుఉంటాయి.
ఒకటి… కొత్తగా ట్రై చేయడం
రెండు.. అలవాటైన దారిలో వెళ్లి సేఫ్ గేమ్ ఆడడం
అనిల్‌రావిపూడి రెండోది ఎంచుకున్నాడు.
సూపర్ స్టార్ దొరికినప్పుడు ఏ దర్శకుడి బుర్రలో అయినా ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కొత్తగా ఏదైనా చేద్దాం, చూపిద్దాం అనిపిస్తుంది. అయితే ఆ దారిలో రిస్కే ఎక్కువ. క్లిక్ అయితే.. దర్శకుడు ఎక్కడో ఉంటాడు. అటూ ఇటూ అయినా సరే ఇంకెక్కడికో వెళ్లిపోతాడు. అయితే రిస్కులు తీసుకుండా, ప్రయాణం చేస్తే కనీసం సినిమా `సేఫ్`గా ఉంటుంది. అనిల్ రావిపూడి ఇదే దారిలో వెళ్లాడు. `సరిలేరు నీకెవ్వరు` కోసం.
`అబ్బబ్బబ్బ.. నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్`అనుకునే ఫార్ములా కాదుగానీ.. అప్పటికప్పుడు టైమ్‌పాస్ అయిపోయి, ఫ్యాన్స్పొంగిపోయి, థ్రిల్ అయిపోయి.. అదే మూడ్‌లోంచి బయటకు వచ్చే రెగ్యులర్ ఫార్మెట్లో తీసిన సినిమా ఇది. ఇంకాస్త విఫులంగా చెప్పుకోవాలంటే..
కథ
అజయ్ కృష్ణ (మహేష్‌బాబు) ఆర్మీ మేజర్. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడే వీర జవాను. తను అనుకోని పరిస్థితుల్లో కర్నూలు వెళ్లాల్సివస్తుంది. అక్కడ ప్రొఫెసర్ భారతి (విజయశాంతి) కుటుంబానికి అండగా నిలవాల్సిన పరిస్థితి వస్తుంది. సరిహద్దుల్లో ఉండాల్సిన సైనికుడు.. కొండారెడ్డి
బురుజు సెంటర్లో – అక్కడి మంత్రి (ప్రకాష్‌రాజ్)కి ఎదురొడ్డి నిలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు? ఏమిటి? తరవాత ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ
నెవ్వర్ బిఫోర్ – ఎవర్ ఆఫ్టర్ కథైతే కాదిది. ఓ హీరో ఓ కుటుంబాన్ని ఆదుకోవడానికి వెళ్లడం, అక్కడి పరిస్థితుల్ని సర్దుబాటు చేసి, మళ్లీ తన దారిన తాను వెళ్లిపోవడం – ఎప్పటిదో పాత కథ. కానీ ఆ కథలో మహేష్‌బాబు ఉన్నాడు. హీరోయిజం ఉంది. ఎలివేషన్లు ఉన్నాయి. డాన్సులున్నాయి. ఫైట్లున్నాయి. అంతే. ఇంతకంటే ఇంకేం కావాలి?? మహేష్ ఫ్యాన్స్‌కి మస్త్ మజాలో ముంచి `ఇందులో ఏం లేదు కదా` అనుకునేలోగానే స్వయంగా డైరెక్టరే (చివరి షాట్లో అలవాటు ప్రకారం ఆయన కనిపించాడు) రంగంలోకి దిగి శుభం కార్డు వేసేశాడు.
భారతికి ఎదురైన పరిస్థితులు, కర్నూలు రౌడీయిజంతో ఈ కథ మొదలై – ఆ వెంటనే కశ్మీర్ కి జంప్ అవుతుంది. అక్కడ ఓ మిలటరీ ఆపరేషన్ లో భాగంగా హీరోని పరిచయం చేసి, `ఇది ఇది వరకు మీరు చూసిన సినిమాలాంటిదే` అంటూ హింట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు అనిల్ రావిపూడి. కర్నూలు ప్రయాణం మధ్యలో ట్రైన్ ఎపిసోడ్ వస్తుంది. అక్కడ రష్మిక చేసే అల్లరి వేషాలన్నీ చూపించేశాడు. ఈ ఎపిసోడ్ అదిరిపోయిందట – అంటూ ముందు నుంచీ తెగ మాట్లాడుకున్నారు. అయితే ఈ ట్రైన్ ఎపిసోడ్ అంతగా వర్కవుట్ కాలేదు , దీనికి బదులుగా మరోటేదో ఆలోచించి, హీరో – హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కోసం అది వాడుకుని ఉంటే బాగుండేది.
ట్రైన్ ఎపిసోడ్ అవ్వగానే కథ కర్నూలులో లాండ్ అవుతుంది. అక్కడ కొండారెడ్డి బురుజు సెంటర్లో అజయ్ గ్యాంగ్‌కి మహేష్ వార్నింగ్ ఇవ్వడం – ఫైట్ – అల్లూరి సీతారామరాజు రిఫరెన్స్.. ఇవన్నీ మహేష్ ఫ్యాన్స్‌కి గూజ్బమ్స్ మూమెంట్స్. ఆ సంతృప్తితో మహేష్ ఫ్యాన్ థియేటర్ల నుంచి బయటకు వస్తారు.
ఇంట్రవెల్ తరవాత కూడా కథ చకచక పరుగెడుతుంది. ఫస్టాఫ్‌లో కనిపించిన లోపాలు… ద్వితీయార్థంలో దర్శకుడు కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. అయితే… హీరో స్వయంగా రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిన దగ్గర్నుంచి కథ ఎటెటో పోతుంది. రాజకీయ నాయకులందరికీ మహేష్ క్లాస్ పీకడం, మా ఆధార్ లింకులు మీ దగ్గర ఉన్నట్టే – మీ లింకులు మా దగ్గర ఉండవా అని అడగడం, ప్రింటర్లో రంగులన్నీ ఏరి టైమ్ బాంబ్ సెట్ చేసి, దాన్ని త్రివర్ణపతాకంలా పేల్చడం ఇవన్నీ బాగున్నాయి.కానీ.. కథకీ, ఆ సీన్‌కీ లింకులు మాత్రం కుదరవు.
అయితే వీటి మధ్య నల్లమల్ల అడవుల్లో – హీరో మరోసారి రెచ్చిపోయి రౌడీ గ్యాంగుని చితకేయడం, అక్కడ మహేష్ ప్రదర్శించిన మేనరిజం.. ఇవన్నీ మళ్లీ మహేష్ ఫ్యాన్స్‌ని కూల్ చేస్తాయి. మైండు బ్లాకు సాంగులో మహేష్ విజృంభించి స్టెప్పులేశాడు. మహేష్ కాస్త మొహమాట పడి డాన్సులు చేయడం లేదు గానీ, తను అనుకుంటే బాగానే చేస్తాడని ఈ పాట నిరూపించింది. మహేష్ ఇక మీదటా.. ఇలానే డాన్సుల మీద శ్రద్ధ తీసుకుంటే ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతారు.
నల్లమల్ల ఫైట్ తరవాత.. ఇంకో ఫైటు పెట్టుకుంటే… సినిమా మరీ లెంగ్తీ అవుతుందనో, క్లైమాక్స్ లో ఫైట్ రొటీన్ అనుకునో, లేదంటే ఈసినిమాకి ఓ కామిక్ ఎక్స్ప్రెషన్తో ముగించాలనో దర్శకుడు భావించి ఉంటాడు. అందుకే అప్పటి వరకూరాయలసీమ యాసలో భారీ డైలాగులు చెప్పిన ప్రకాష్‌రాజ్‌తో కాళ్లబేరానికి వచ్చేలా చేస్తాడు.
ఓ స్టార్ హీరో దొరగ్గానే ఆ దారిలో వెళ్లి, హీరోయిజం చూపించేసి ఫ్యాన్స్‌ని సంతృప్తిపరిచాడు అనిల్‌రావిపూడి. అయితే ఆ ప్రయాణంలో తన బలమైన కామెడీ టచ్‌ని కాస్త అశ్రద్ధ చేశాడు.
నటీనటులు
మహేష్ ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఓ ట్రీట్‌లా ఉంటుంది. వాళ్లందరికీ ఇది నిజమైన పండగ సినిమా. ఫ్యాన్స్‌ని మెప్పించడం కోసం కామెడీ, యాక్షన్, పంచ్ డైలాగులు, డాన్సులు.. ఇలా ఏం చేయాలో అన్నీ చేశాడు మహేష్. రష్మిక కెరీర్లో ఇదే శుద్ధ దండగ పాత్ర. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్గా రష్మిక బండి లాగించడం చాలా కష్టం అనే సంకేతాలను ఈ సినిమా పంపింది. విజయశాంతి స్టార్డమ్ ఆ పాత్రకు మరింత వన్నె తెచ్చింది. కచ్చితంగా మహిళా ప్రేక్షకుల్ని ఆకర్షించే ఫ్యాక్టర్ ఆ పాత్ర. ప్రకాష్‌రాజ్ ని ముందు భీకరంగా చూపించి, ఆ తరవాత శ్రీనువైట్ల సినిమాల్లో విలన్లా బకరాని చేసేశారు. మహేష్ బాబు వెనుక నడవడం, మహేష్ వేసే జోకులకు రియాక్షన్ ఇవ్వడం తప్ప రాజేంద్రప్రసాద్ చేసిందేం లేదు.
సాంకేతిక వర్గం
దేవిశ్రీ ఇచ్చిన పాటలపై విడుదలకు ముందు చాలా ట్రోలింగ్ జరిగింది. అయితే మహేష్ వేసిన స్టెప్పుల వల్లో, మాస్ మూమెంట్స్ వల్లో తెలీదు గానీ, ఆ పాటలు థియేటర్లో క్లిక్ అయ్యాయి. హీరోయిజం ఎలివేట్ చేసే సన్నివేశాలలో ఆర్.ఆర్ బాగుంది. రత్నవేలు కెమెరాపనితనం గురించి చెప్పేదేముంది? ఎప్పటిలా ది బెస్ట్ ఇచ్చారు. అనిల్ రావిపూడి మేనరిజాలు ఈ సినిమాలో వర్కవుట్ అవ్వలేదు.సైనికుల గురించి చెప్పే సంభాషణలు బాగున్నాయి.
అనిల్ రావిపూడి తన కామెడీ బలాన్ని వదిలేసి, హీరో ప్లస్సులపై దృష్టి నిలిపాడు. ఫ్యాన్స్‌కి కావల్సింది అదే కాబట్టి – ఈ ఫార్ములా వర్కవుట్ అయిపోతుంది. ఫ్యామిలీస్ కి కూడా వల్గారిటీ , వయొలెన్స్ లేని ఈ సినిమా చూడవచ్చు
ఫినిషింగ్ టచ్: పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ !
తెలుగు360 రేటింగ్ 3/5