జనసేన అధినేత పవన్ కల్యాణ్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగుతూండగానే.. మధ్యలోనే ఆయన గన్నవరం బయలుదేరారు. మామూలుగా అయితే.. ఆయనకు.. ఢిల్లీ షెడ్యూల్ లేదు. కానీ.. కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్మెంట్ ఖరారయిందని సమాచారం వచ్చిన వెంటనే ఆయన ఢిల్లీకి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చిన కేంద్ర పెద్దలెవరు..? పవన్ ఏ అంశాలపై చర్చిస్తారన్న విషయంపై మాత్రం.. జనసేన వర్గాలు నోరు మెదపడం లేదు. అయితే.. రాజధాని గురించి మాత్రమే చర్చించడానికి పవన్ కల్యాణ్ వెళ్తున్నారని.. రాజధాని రైతుల ఉద్యమంపై.. పవన్ కల్యాణ్ తీవ్రంగా కలత చెందారని.. జనసేన వర్గాలు చెబుతున్నాయి.
పవన్ కల్యాణ్.. ఒక్క రోజు ముందే.. రాజధాని అంశంలో.. కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దానికో ప్రాతిపదిక కూడా చెప్పారు. విభజన చట్టంలో రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరించాలని ఉందని.. ఇంత కన్నా… ఏం కావాలని ఆయన చెబుతున్నారు. ఆయితే కొంత మంది బీజేపీ నేతలు మాత్రం.. ఏపీ రాజధాని అంశంతో కేంద్రానికి సంబంధం లేదని అది అంతర్గత అంశమని చెప్పుకొస్తున్నారు. కానీ.. కేంద్రం అనుమతి లేకుండా… అదీ కూడా.. ఓ కొత్త రాష్ట్రం… తన రాజధానిని ఎలా మార్చగలదన్న మౌలికమైన ప్రశ్న సహజంగానే వస్తోంది.
పవన్ కల్యాణ్ గతంలోనే.. ఓ సారి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఎవరెవర్ని కలిశారన్నదానిపై స్పష్టత లేదు. కానీ.. ఆయన బీజేపీలోని కొంత మంది పెద్దల్ని కలిసినట్లుగా మాత్రం ప్రచారం జరిగింది. ఏం చర్చించారో కానీ.. కొన్ని అంశాల పట్ల పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా మార్చుకున్నట్లుగా కనిపించింది. ఇప్పుడు.. తనకు ఉన్న పరిచయాలతో.. ఢిల్లీ స్థాయిలో పవన్ .. రాజధాని అంశం కోసం మరోసారి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్.. ఎంత మేర సక్సెస్ అవుతారో చూడాలి..!