తెరాసకి ప్రత్యామ్నాయం మేమే, కేసీఆర్ ని గద్దెదింపి అధికారంలోకి వచ్చేది మేమే, రాష్ట్ర ప్రజలంతా మావైపే చూస్తున్నారు… గత కొద్ది రోజులుగా తెలంగాణ భాజపా నేతలు చేస్తున్న ప్రకటనలివి. నిజానికి, ఒక రాజకీయ పార్టీ అసలైన బలం… నాయకులు మైకులు ముందు చేసే ప్రకటనల్లో కనబడదు, పోలింగ్ కేంద్రాల్లో అసలు సత్తా తేలుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస వెర్సెస్ భాజపా మధ్యే అసలైన పోటీ అంటూ… తమ స్థాయిని తెలంగాణలో రెండో పెద్ద పార్టీగా చిత్రించుకుంటూ వచ్చారు కమలనాథులు. అయితే, వాస్తవం ఏంటో ఇప్పుడు అర్థమౌతోంది. తత్వం బోధపడ్డాక తలలు పట్టుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ముగిసిన నేపథ్యంలో పార్టీ నేతలతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి, బీజేపీ క్లస్టర్ ఇన్ ఛార్జ్ కిషన్ రెడ్డి. పార్టీ నేతల పనితీరు మీద ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
భాజపా తరఫున వార్డుల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారనీ, పార్టీ ఆఫీస్ ముందు క్యూలు కడుతున్నారంటూ ఆ పార్టీకి చెందిన ఓ పత్రికతోపాటు, కొంతమంది నాయకులూ ఊదరగొడుతూ వచ్చారు. వాస్తవం ఏంటంటే… రాష్ట్రవ్యాప్తంగా 30 శాతం వార్డుల్లో భాజపాకి అభ్యర్థులే దొరకలేదు. రాష్ట్రంలో మొత్తంలో 2,727 వార్డులుంటే అన్ని చోట్లా అభ్యర్థుల్ని నిలబెట్టడంలో నాయకులు విఫలమయ్యారన్నమాట. దీంతో, పార్టీ ఆఫీస్ లో జరిగిన సమీక్షలో కిషన్ రెడ్డి తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తూ, నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. జిల్లాలో ఏ మారుమూలో అభ్యర్థులు దొరకలేదంటే కొంత నయమనీ, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొన్ని చోట్ల అభ్యర్థులను నిలబెట్ట లేకపోవడం మరీ దారుణమని, నాయకులు ఏం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో మంచి పట్టు ఉందని చెప్పుకుంటున్నామనీ, పూర్తి స్థాయిలో పోటీ పడలేకపోతున్నామంటే ఏమనుకోవాలని కొందరు నాయకుల్ని నిలదీశారట.
ఇప్పుడు ఏం చెయ్యాలి అనే అంశమై పార్టీ నేతలతో కిషన్ రెడ్డి చర్చంచారని సమాచారం. ఇతర పార్టీల్లో టిక్కెట్లు రాని వారిపై ద్రుష్టిపెట్టాలనీ, రెబెల్స్ గా బరిలోని దిగినవారిని మనవైపు తిప్పుకోవాలనే వ్యూహం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. నామినేషన్ వేసిన రెబెల్స్ తో వెంటనే టచ్ లోకి వెళ్లాలనీ, వారి పార్టీ నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా భయపడొద్దనీ, నామినేషన్లు వెనక్కి తీసుకోవద్దనీ, అన్ని రకాలుగా భాజపా సాయం చేస్తుందంటూ భరోసా కల్పించాలంటూ కిషన్ రెడ్డి సూచించారని తెలుస్తోంది. అంటే, ఇప్పుడు భాజపా చాలా స్థానాల్లో రెబెల్ అభ్యర్థుల మీద ఆశలు పెట్టుకుంటోందన్నమాట. ఈ పరిస్థితి రావడానికి కారణం, సరైన ప్రణాళికతో రాష్ట్ర నాయకత్వం లేకపోవడమే అనాలి.