తెలంగాణలో టీడీపీ కనుమరుగైనా ఒకప్పుడు ఆ పార్టీలో ఓ వెలుగు వెలిగి, ఆ తరువాత తాను అమితంగా అభిమానించిన చంద్రబాబుకే బద్ధ శత్రువైపోయి, కొన్ని రోజుల కిందటే బీజేపీలో చేరిన దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అంటే తెలియనివారెవరూ ఉండరు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ఇతర నాయకుల మాదిరిగా వెంటనే టీఆర్ఎస్లోకి ఫిరాయించకుండా చాలాకాలం టీడీపీలోనే ఉండి గవర్నర్ పదవి కోసం ఎదురుచూశాడు మోత్కుపల్లి.
అప్పట్లో ఎపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామి అనే సంగతి తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ నేతలు మంత్రులుగా ఉండగా, కేంద్రంలో టీడీపీ నేతలు మంత్రులుగా ఉన్నారు. దీంతో మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు. పాపం…మోత్కుపల్లి కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని చాలా కాలం పదవి కోసం ఎదురుచూశారు. అప్పట్లో కేంద్రంలో మంత్రిగా ఉంటూ ఉప రాష్ట్రపతి అయ్యే క్రమంలో హైదరాబాదుకు వచ్చిన వెంకయ్య నాయుడు సైతం మోత్కుపల్లికి గవర్నరు పదవి గ్యారంటీ అని చెప్పారు. ఈ నాయకుడు అలా ఎదురుచూస్తుండగానే చంద్రబాబుకు బీజేపీకి చెడిపోవడం, ఎన్డీఏ నుంచి బయటకు రావడం, రచ్చరచ్చ చేసుకోవడంతో మోత్కుపల్లికి పదవి ఆవిరైపోయింది.
ఆ తరువాత వివిధ కారణాలతో మోత్కుపల్లి టీడీపీని, చంద్రబాబును తిడుతూ వీరంగం వేయడంతో బాబు ఆయన్ని పార్టీ బహిష్కరించాడు. దీంతో తిరుమల వెళ్లి 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాలని మొక్కులు మొక్కుకొని వచ్చారు. చంద్రబాబు ఓడిపోతే తనకు సంబరంగా ఉంటుందన్నాడు. ఆ తరువాత వైకాపాలో చేరతాడని అనుకున్నారు. విజయసాయి రెడ్డి వచ్చి చర్చలు జరిపాడు. కాని చివరకు కాషాయం కండువా కప్పుకున్నాడు. టీడీపీలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేసి, ఒంటికాలి మీద లేచిన మోత్కుపల్లి ఇప్పుడు బీజేపీలో చేరాడు కాబట్టి కేసీఆర్తో వైరం కొనసాగుతూనేవుంటుంది.
మోత్కుపల్లి ఇప్పుడొక లక్ష్యం పెట్టుకున్నాడు. అదే…కేసీఆర్ను గద్దె దింపడం. అంటే వచ్చే ఎన్నికల వరకు మోత్కుపల్లి ఆగేలా లేడన్నమాట. గద్దె దింపడమంటే ప్రభుత్వాన్ని కూలదోయాలని అనుకోవడమే కదా. మరి ఇందుకోసం ఏం చేయాలి? ఏం చేస్తే లక్ష్యం ఫలిస్తుంది? ఈ నాయకుడికి ఓ బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. తన లక్ష్యం నెరవేరాలంటే దైవబలాన్ని నమ్ముకోవాలని అనుకున్నాడు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు త్వరలోనే బ్రహ్మాండమైన యాగం చేస్తాడట….! పార్టీలో చేరాక తొలిసారి బీజేపీ కార్యాలయానికి వచ్చిన మోత్కుపల్లి ‘కేసీఆర్ పతనం చూడటమే నా లక్ష్యం’ అని ప్రకటించాడు.
కేసీఆర్ను గద్దె దించాలని యాదగిరి లక్ష్మీనరసింహ స్వామికి మొక్కుకున్నానని చెప్పాడు. కేసీఆర్ అనే శని బాధ పోవడానికి యాగం చేస్తానని చెప్పాడు. కేసీఆర్కు భారీగా యాగాలు, పూజలు చేయడం అలవాటే కదా. యాగాల కారణంగా తాను అనుకున్న పనులు విజయవంతంగా అవుతాయని కేసీఆర్ నమ్మకం. యాగం కారణంగా ఆయనకు విజయాలు కలుగుతున్నాయి కాబట్టి తనకూ కలుగుతాయని మోత్కుపల్లి భావిస్తున్నారేమో తెలియదు. ఆయన నమ్మకం ఆయనది.