ఇటీవలి కాలంలో సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబును అడ్డుకుంటామని పెద్దిరెడ్డి, బొత్స అదే పనిగా చెబుతున్నారు. ఓ కులంపై దండెత్తుతున్నారు. ఇదంతా ఎందుకు అంటే… సీఎం పదవి కోసమేనంటున్నారు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. ఆయన వారాంతంలో రాసే కొత్త పలుకు ఆర్టికల్‌లో.. ఈ విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా వారెందుకు అంత దూకుడు ప్రదర్శిస్తున్నారంటే.. ఆరు నెలల్లో.. జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని.. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం రేస్ జరుగుతుందని.. అందులో తాముండాలని.. వారిద్దరూ కోరుకుంటున్నారట. జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం పోస్టు వెరొకరికి ఇవ్వరు. తన భార్యకే ఇస్తారు. అందు కోసం ఇప్పటికే ట్రైనింగ్ లాంటి వాటిని ప్రారంభించారు కూడా.
కానీ.. బొత్స, పెద్దిరెడ్డి లాంటి వాళ్లు ఇంత కాలం రాజకీయాల్లో ఉండి.. అలా చేతులు కట్టుకుని వెళ్లిపోయే రకం కాదు. అందుకే.. తమ వంతుగా.. ఓ గ్రూప్‌ని రెడీ చేసుకున్నట్లుగా..ఆర్కే చెప్పకనే చెప్పారు. జగన్ జైలుకెళ్లిన తర్వాత రాజకీయ పరిణామాలు.. తమిళనాడు తరహాలో ఉంటాయన్న అభిప్రాయాన్ని ఆర్కే వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ కూడా.. ఈ విషయంలో క్లారిటీగా ఉందని చెప్పకనే చెప్పారు. రాజధాని లాంటి ఇష్యూలతో… జగన్ ఎంత భ్రష్టుపట్టిపోవాలో.. అంతగా భ్రష్టుపట్టిపోయిన తర్వాత కేంద్రం తన కార్యాచరణ ప్రారంభిస్తుందని… అప్పటి వరకూ.. జోక్యం చేసుకోకుండా చూస్తూండటమే.. కేంద్రం పని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఎంత వ్యతిరేకత పెంచుకుంటే.. తమ పని అంత సులువు అవుతుందని బీజేపీ భావిస్తున్నట్లుగా ఆర్కే చెబుతున్నారు. అంతే కాదు.. కులం పరంగా ఏపీలో ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి హింసిస్తున్న తీరు.. కలకలం రేపుతోంది.
దేశవ్యాప్తంగా ఆంధ్రను నవ్వుల పాలు చేస్తోందని ఆర్కే ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇదేం దుస్థితి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక నేరగాడికి.. ఓట్లు వేయడమే ప్రజలు చేసిన తప్పని.. అలాంటి తప్పు ప్రజలు ఎలా చేశారని ఆశ్చర్యపోయారు. ఈ వారం ఆర్టికల్‌లో పెట్టుబడులు.. రాజశేఖర్ రెడ్డి పాలనా తీరు.. అమరావతి లో రియల్ ఎస్టేట్ చేయాలనుకున్న చంద్రబాబు అంటూ వస్తున్న విమర్శలపైనా… ఆర్కే విశ్లేషణ జరిపారు.