వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ ఫోబియా గట్టిగానే పట్టుకున్నట్లుగా ఉంది. హైదరాబాద్ సీబీఐ జాయింట్ డైరక్టర్‌గా.. హెచ్.వెంకటేష్ అనే అధికారిని నియమించబోతున్నారని.. తెలియగానే.. ఆయన ఉలిక్కిపడ్డారు. వెంటనే.. నేరుగా.. ఎంపీ హోదాలో.. కేంద్రహోం మంత్రి అమిత్ షాకు.. హుటాహుటిన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందని అధికారిని సీబీఐ జేడీగా నియమించాలని అందులో కోరారు. హెచ్ . వెంకటేష్ అనే అధికారిని నియమించబోతున్నట్లుగా తెలిసిందని.. ఆయన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ సన్నిహితులని.. పైగా ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అని..అమిత్ షాకు లేఖలో చెప్పారు విజయసాయిరెడ్డి.
నిజానికి విజయసాయిరెడ్డి చెప్పిన హెచ్. వెంకటేష్ కర్ణాటక వ్యక్తి. ఈ విషయాన్ని విజయ సాయిరెడ్డే తన లేఖలో చెప్పుకొచ్చారు. ఆయన కర్ణాటకకు చెందిన వ్యక్తి అయినప్పటికీ.. ఆయన మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని.. ఆయన తల్లిదండ్రులు తెలుగు వాళ్లని చెప్పుకొచ్చారు. వి.వి. లక్ష్మీనారాయణ సీబీఐ జేడీగా ఉన్న కాలంలో ఆయన ఎస్పీగా పని చేశారని.. ఆయన చంద్రబాబు చెప్పినట్లుగా చేస్తారంటూ.. లేఖలో రాజకీయం చొప్పించారు. ఇంకా విశేషం ఏమిటంటే.. తన హయాంలో జరిగిన భారీ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు.. తనకు సన్నిహితులైన సీబీఐ అధికారుల్ని.. నియమించుకుంటున్నారట. హెచ్. వెంకటేష్ అనే అధికారి సీబీఐ జేడీగా రాకూడదన్న కారణంగా.. ఆయనపై.. వేయాల్సిన నిందలన్నింటినీ.. విజయసాయిరెడ్డి తన లేఖలో వేసినట్లుగా స్పష్టమవుతోంది.
విజయసాయిరెడ్డి బాధ అంతా.. అక్రమాస్తుల కేసులో సీబీఐ.. కఠినంగా వ్యవహరిస్తూండటమేనన్న ప్రచారం జరుగుతోంది. బెయిల్ షరతులు సడలించడానికి .. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడానికి కూడా.. సీబీఐ అంగీకరించడం లేదు. తీవ్రమైన ఆర్థిక నేరాలున్న వారికి మినహాయింపులొద్దని గట్టిగానే వాదిస్తోంది. ఏ విషయంలోనూ.. మెతకగా ఉండేందుకు సిద్ధపడటం లేదు. ఇది.. విజయసాయిరెడ్డికి నచ్చినట్లుగా లేదు. కఠినంగా ఉండే సీబీఐ అధికారి వస్తే.. ఎక్కడ ఇబ్బంది ఎదురవుతుందోనని… అనుకూలమైన అధికారి కోసం.. ముందుగానే.. వస్తారనుకున్న అధికారులపై.. కంప్లైంట్లు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. విజయసాయిరెడ్డి రాసిన లేఖను.. అమిత్ షా రొటీన్‌గా డీవోపీటీకి పంపారు. దీన్నే పబ్లిసిటీకి వాడుకున్నారు విజయసాయిరెడ్డి. మరి విజయసాయి వద్దంటున్న హెచ్. వెంకటేష్‌ను.. సీబీఐ జేడీగా కేంద్రం పంపుతుందో లేదా.. విజయసాయిరెడ్డి కోరుకునే జేడీని పంపుతుందో.. వేచి చూడాలి..!