అమరావతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీ ఏపీ నేతలు.. ఎట్టకేలకు.. ఓ ఏకగ్రీవ తీర్మానం చేశారు. జీవీఎల్, సోము వీర్రాజు లాంటి.. అతి కొద్ది మంది నేతలు మినహా.. మిగతా అన్ని ప్రాంతాల నేతలూ.. అమరావతికే కట్టుబడి ఉన్నట్లుగా ప్రకటించడంతో.. వారిద్దరూ కూడా.. సైలెంట్ కావాల్సి వచ్చింది. ఏకగ్రీవంగా.. అమరావతికి మద్దతుగా తీర్మానం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు సిద్ధమే కానీ.. పాలనా వికేంద్రీకరణకు మాత్రం అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత అమరావతికి మద్దతుగా ప్రత్యక్ష పోరాటానికి దిగనున్నట్లు కన్నా ప్రకటించారు. అయితే జీవీఎల్ నరసింహారావు మాత్రం.. రాజధాని విషయం కేంద్రానికి సంబంధం లేదన్నట్లుగా తీర్మానం చేయించాలని ప్రయత్నించారు. కానీ.. ఎవరూ మద్దతుగా నిలబడలేదు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని మారిస్తే చెడ్డపేరు వస్తుందని.. జీవీఎల్ పై ఘాటుగానే విరుచుకుపడ్డారు.
అయితే.. ఇప్పుడు అమరావతికి మద్దతిస్తే.. అది టీడీపీకి మద్దతు ఇచ్చినట్లుగా మారుతుందనే భావనను కొంత మంది వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్‌గా గత ప్రభుత్వం చేసిందీ తప్పే.. ఈ ప్రభుత్వం చేస్తున్నది కూడా అంత కంటే తప్పేననని.. ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. గత ప్రభుత్వం .. ఈ ప్రభుత్వం కూడా.. రియల్ ఎస్టేట్ కోణంలోనే రాజధానులను చూస్తున్నాయని కన్నా సమావేశం తర్వాత విమర్శించారు. ఏపీ బీజీపీ నేతలు తీర్మానం చేశారు. దాన్ని తమ పార్టీ హైకమండ్‌కు పంపుతారు. మరి.. ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందనేది.. ఆసక్తికరంగా మారింది. ఒకరిద్దరు తప్ప.. అందరిదీ అమరావతికి అనుకూలంగా నిర్ణయమే. బీజేపీ పెద్దల అభిప్రాయం మాత్రం ఇంత వరకూ బయటకు రాలేదు. రాష్ట్ర నేతల అభిప్రాయమే.. తమ అభిప్రాయం అనే అవకాశం ఉంది. కానీ.. నిజంగా అలాంటి ఆలోచనే ఉంటే.. ఇప్పటి వరకూ చెప్పకుండా ఉండరని.. అంటున్నారు.
ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై కేంద్రానికి ముందుగానే సమాచారం ఉందని.. అందుకే.. తమకు సంబంధం లేదనే వాదనను.. చాలా ముందు నుంచి వినిపిస్తున్నారని చెబుతున్నారు. అధికారికంగా బీజేపీ ఢిల్లీ పెద్దలు.. అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తే.. సీన్ మారిపోయినట్లే అవుతుంది. అలా ప్రకటించిన తర్వాత కేంద్రం సైలెంట్‌గా ఉంటే.. వారు రాజకీయ మోసానికి పాల్పడినట్లుగా అవుతుంది. అందుకే.. ఏపీ బీజేపీ తీర్మానాన్ని .. ఢిల్లీ పెద్దలు ఆమోదిస్తే.. అమరావతి తరలింపు జరిగే ప్రసక్తే ఉండదు.