అమరావతి మహిళలపై పోలీసులు జరిపిన దాడులు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. వీటిపై సుమోటోగా స్పందించిన మహిళా కమిషన్.. గుంటూరుకు.. ఒక బృందాన్ని పంపింది. ఈ బృందం.. పోలీసుల దాడుల్లో గాయపడిన మహిళల వద్దకు వెళ్లింది. గ్రామాల్లో పర్యటించింది. అయితే.. ఈ బృందం పదకొండు గంటలకు.. ఆయా గ్రామాలకు వస్తుందని తెలిసిన తర్వాత.. పోలీసులు ఆ సమయం కల్లా… గ్రామాల నుంచి వెళ్లిపోయారు. అంతకు ముందు ఉదయం ఏడు గంటల నుంచి.. గ్రామాల్లోని సందుగొందుల్లో వందల మంది పోలీసులు కవాతు నిర్వహించారు. గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని.. ఎవరూ బయటకు రావొద్దని ప్రకటనలు చేశారు. మహిళా కమిషన్కు.. వివరాలు చెప్పకుండా.. గ్రామస్తుల్ని భయపడుతున్నారన్న విమర్శలు పోలీసులపై వచ్చాయి.అయితే.. కచ్చితంగా కమిషన్ వచ్చే సమయానికి పోలీసుల అలజడి లేకుండా గ్రామాలు దాదాపుగా ప్రశాంతంగా మారాయి.
పోలీసులు తప్పు చేయకపోతే.. మహిళా కమిషన్ సభ్యులు వచ్చినప్పుడు ఎందుకు వెళ్లిపోయారని అమరావతి.. పరిరక్షణ సమితి సభ్యులు మండిపడ్డారు. మరో వైపు మహిళా కమిషన్.. మహిళలపై దాడులు జరిగిన ప్రదేశాలను.. పరిశీలించింది. గ్రామాల్లో ఉన్న నిరసన శిబిరాల వద్దకు వెళ్లింది. పోలీసుల అనుచిత దాడులకు గాయపడిన వారంతా.. ఏం జరిగిందో.. సభ్యులకు పూసగుచ్చినట్లుగా వివరించారు. గత కొద్ది రోజులుగా పోలీసులు చేస్తున్న అరాచకాన్ని మహిళా కమిషన్కు వివరించేందుకు పెద్ద ఎత్తున.. మహిళలు తుళ్లూరుకు తరలి వచ్చారు. దాడి ఘటనపై.. మీడియాలో రాని.. తాము స్వయంగా చిత్రీకరించిన దృశ్యాలను.. మహిళా కమిషన్ సభ్యులకు అందజేశారు.
అమరావతి ఉద్యమంలో మహిళలే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరిని అణిచివేయడానికి.. పోలీసులు అత్యంత దారుణమైన పద్దతుల్ని ఉపయోగించుకుంటున్నారు. దారుణమైన భాషను ఉపయోగిస్తూ.. కులం పేరుతో దూషిస్తూ.. మానసికంగా కించ పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మహిళా కమిషన్ .. జోక్యం చేసుకోవడం.. ఆసక్తి రేపుతోంది. మహిళా కమిషన్కు జ్యూడిషయల్ పవర్స్ ఉంటాయి. మహిళలపై దాడులు జరిగితే.. చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. ఇప్పుడు.. విచారణ తర్వాత మహిళా కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి..!