ఓ ప్రాజెక్టు పనులు జరుగుతూ ఉంటాయి. అక్కడికి కొంత మంది వ్యక్తులు.. బాగా చీకటి పడిన తర్వాతో.. బాగా తెల్లవారిన తర్వాతో.. వచ్చి పనులు చూసి.. కార్యకలాపాలు చక్కబెట్టి పోతూంటారు. అక్కడ జరుగుతున్న ప్రాజెక్టు పనులు.. ఫలానా రాజకీయ నేతవని.. చెప్పుకుంటూ ఉంటారు అక్కడి జనాలు. కానీ అన్నీ రూమర్స్ గానే ఉంటాయి.. ఒక్కోసారి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. అలా.. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొరికిపోయారు. తెలంగాణలో అనేక కాంట్రాక్టులు చేస్తున్న పెద్దిరెడ్డి కంపెనీ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ పనులను.. పరిశీలించడానికి వచ్చిన పెద్దిరెడ్డి.. ఓ నిర్వాసిత రైతుపై దాడికి పాల్పడటంతో విషయం హైలెట్ అయింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బస్వాపూర్ రిజర్వాయర్ పనులను.. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్ సంస్థ చేపట్టింది. ఈ పనులను.. ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ.. వారానికి ఓ రోజు.. తెల్లవారు జామునే వచ్చి పరిశీలించి పోతారు. అక్కడ పని వాళ్లకు సూచనలు ఇచ్చిపోతారు. అలా.. ఆదివారం తెల్లవారుజామునే ఆయన వచ్చారు. కానీ ఓ నిర్వాసితుడు.. తనకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడంతో… ఆయనపై పెద్దిరెడ్డి మండిపడ్డారు. దాడి చేయమని.. గన్మెన్, ఉద్యోగులను పురమాయించారు. దాంతో విషయం పెద్దదయిపోయింది. పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ పెద్దిరెడ్డిది. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ రికార్డుల్లో మాత్రం ఆయన పేరు ఉండదు. ఆ సంస్థ మేనేజింగ్ డైరక్టర్, డైరక్టర్లుగా ఇంట్లో మహిళల పేర్లు పెట్టారు. పనులు మాత్రం పెద్దిరెడ్డి చక్క బెట్టుకుంటారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టులన్నీ.. ఏపీ నేతలకు..ముఖ్యంగా వైసీపీ నేతలకే దక్కాయని.. వారి ద్వారా వెళ్లిన నిధులే.. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో.. వైసీపీ ఖర్చు చేసిందనే ప్రచారం చాలా రోజుల నుంచి ఉంది. ఒక్క పెద్దిరెడ్డి కంపెనీనే కొన్ని వేల కోట్ల పనులు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికల సమయంలో.. పెద్దిరెడ్డి కంపెనీ ద్వారానే… ఏపీలోకి నిధుల ప్రవాహం వచ్చిందని టీడీపీ నేతలు కూడా ఆరోపించారు. ఇప్పుడు పెద్దిరెడ్డి.. పొరుగు రాష్ట్రానికి వెళ్లి ఓ నిర్వాసిత రైతుపై దాడి చేయడం ద్వారా.. ఇది నిజమేనేమో అనే అభిప్రాయం కల్పించారు.