అమరావతిలో ఆందోళన చేస్తున్న వారిపై… జగన్ మార్క్ పోలీస్ ట్రీట్మెంట్ విశాఖలోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఇతర చోట్ల వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు… బెదిరింపులు.. దాడులు కూడా.. చర్చనీయాంశం అవుతుతున్నాయి. అసలు.. విశాఖలో రాజధాని ఎందుకు పెట్టాలనుకుంటున్నారనే ప్రశ్నకు.. ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టమైన సమాధానాన్ని చెప్పలేకపోయింది. కానీ.. విపక్షాలు మాత్రం… శాంతిభద్రతల అంశాన్ని చాలా పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడేందుకే రాజధాని అన్న ప్రచారం జరుగుతూండటంతో.. ప్రజలు కూడా.. భయాందోళనలకు గురయ్యే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో.. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే.. ఏం జరుగుతుందో.. అమరావతిలో పోలీసులు చూపిస్తున్నారు. పోలీసుల ద్వారానే.. చేయాల్సినవన్నీ చేస్తూండటంతో.. తమకు భద్రత ఎక్కడి నుంచి వస్తుందన్న ఆలోచన సాగర తీర ప్రజల్లో ఏర్పడుతోందంటున్నారు.
ఇప్పుడు విశాఖ వాసుల్లో రాజధాని అంశం కన్నా.. ప్రజల అభిప్రాయాల్లో ప్రధానంగా వినిపిస్తున్న శాంతిభద్రతలే. నిన్నటిదాకా.. రాజధానిని గట్టిగా స్వాగతించిన నేతలు ఇప్పుడు.. శాంతిభద్రతల అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సహా.. ఇతర పార్టీలకు చెందిన నేతలంతా.. ప్రధానంగా.. శాంతిభద్రతల సమస్య గురించే చర్చిస్తున్నారు. కొంత మంది నేతలు.. నేరుగా జగన్‌కే లేఖలు రాస్తున్నారు. విశాఖ ప్రజలు.. వైసీపీ తీసుకు వస్తున్న రాజధాని అంటేనే.. భయపడుతున్నారని రాజకీయ పార్టీల నేతలు చెప్పకనే చెబుతున్నారు. నిజానికి విశాఖకు రాజధాని కావాలని.. ఇంత వరకూ ఎవరూ డిమాండ్ చేయలేదు. ఎప్పుడూ ఉద్యమాలు కూడా జరగలేదు. కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి దృష్టి విశాఖపై పడింది. రాజధానిని అక్కడ పెట్టాలనుకుంటున్నామని ప్రకటించారు . దీంతో రాజధాని పేరుతో.. భూదందాలు జరిగితే.. భరించడం కష్టమన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందంటున్నారు. ఇప్పటికే వైసీపీ నేతల అరాచకాలు.. చాలా చోట్ల.. ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.
ఈ భయాలు అంతకంతకూ పెరిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ నేతలు విశాఖను హైదరాబాద్ చేసేస్తామని చెబుతున్నారు కానీ.. అక్కడి ప్రజలకు మాత్రం.. వైఎస్ హయాంలో హైదరాబాద్ లో జరిగిన భూదందాలే గుర్తుకు వచ్చే పరిస్థితి ఏర్పడిపోయింది. వీటినే ఇతర పార్టీల నేతలు.. సూటిగా చెప్పేస్తున్నారు. శాంతిభద్రతల అభయం ప్రభుత్వం ఇవ్వాలని అంటున్నారు. అసలు విశాఖ వాసుల్లో… ఈ ఆందోళన ఇప్పటి నుంచి కాదు.. 2014 నుంచే ఉంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు.. విశాఖలో .. వైసీపీ నేతలు.. వైఎస్ బంధువులు చేసిన వ్యవహారాలు ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉన్నాయి. అవే 2014లో విజయమ్మ ఓటమికి కారణం అయ్యాయని అనుకున్నారు. ఇప్పుడు.. రాజధాని తీసుకొస్తామని జగన్ చెబుతున్నా… అక్కడి ప్రజల్లో అదే భయం వెంటాడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు అమరావతి పరిణామాలు వారిని మరింత భయపెడుతున్నాయి.