తెలుగు రాష్ట్రాలలో న్యూస్ ఛానెల్స్ లో టీవీ9 కి ఉన్న క్రెడిబిలిటీ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన విషయంలో తప్పు వార్త ప్రసారం చేసి టీవీ9 ఖంగు తినడం ఈరోజు మీడియా వర్గాలలో ఆసక్తి కలిగించింది. వివరాల్లోకి వెళితే..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటనలో ఉండగా, ఢిల్లీ నుండి కబురు రావడంతో, అటు నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి గత రెండు రోజులుగా అక్కడే మకాం వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది పూర్తిగా రాజకీయ పర్యటన కావడంతో, పవన్ కళ్యాణ్ అక్కడ ఎవరిని కలవనున్నారు అన్న విషయం పై జనసేన పార్టీ మీడియాకు పూర్తి సమాచారం ఇవ్వలేదు. అక్కడ పవన్ కళ్యాణ్ ఎవరెవరిని కలుస్తున్నారు అన్న విషయం మీద సమాచారం లేక పోవడంతో మీడియా చానల్స్ కి కూడా స్పష్టత లేకుండా పోయింది. అయితే, ఈ రోజు మధ్యాహ్నం టీవీ9 , పవన్ కళ్యాణ్ కు రెండో సారి బిజెపి ఝలక్ ఇచ్చిందంటూ వార్తలు ప్రసారం చేసింది. పవన్ కళ్యాణ్ తనకు తానుగా ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాడు అని, వారు మాత్రం కరుణించ లేదని, ఇక ఈ రోజు సాయంత్రం లోపు ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తే వారిని కలుస్తాడని, లేకపోతే ఎవరినీ కలవకుండానే తిరిగి వస్తాడని కథనాన్ని ప్రసారం చేసింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ కి ఢిల్లీలో చుక్కెదురైంది అంటూ వ్యాఖ్యానించింది.
అయితే ఈ మధ్యలోనే పవన్ కళ్యాణ్ జేపీ నడ్డా తో భేటీ అయిన విషయం, అందుకు సంబంధించిన ఫోటోలతో సహా జనసేన పార్టీ విడుదల చేయడంతో, టీవీ 9 ఖంగు తిన్నట్లు అయింది. మిగతా అన్ని చానల్స్ లో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వార్తలు స్క్రోల్ అవుతుంటే, తాము ప్రసారం చేసిన వార్తను తామే ఖండించ లేక టీవీ9 మిన్నకుండి పోయింది.
ఏది ఏమైనా, జేపీ నడ్డా తో పాటు మరి కొందరి తో కూడా పవన్ కళ్యాణ్ సమావేశాలు జరిపినట్లు, అమరావతి తో పాటు జగన్ అరాచక పాలన, స్థానిక ఎన్నికలలో పొత్తుల గురించి చర్చించినట్లు సమాచారం.