తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గతంలో ఎప్పుడూ విసరని ఓ చాలెంజ్‌ను జగన్మోహన్ రెడ్డికి విసిరారు. మూడు రాజధానులు అజెండాగా .. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లాలని.. తెలుగుదేశం పార్టీ ఓడిపోతే.. తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతానని.. సవాల్ చేశారు. అమరావతి రాజధానికి రాష్ట్ర వ్యాప్త మద్దతు ఉందని.. చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. గతంలో.. ఎప్పుడూ కూడా చంద్రబాబు తాను రాజకీయాల నుంచి వైదొలుగుతాననే సవాల్‌ను విసరలేదు. రెండు సార్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎన్నికలు ఎదుర్కొన్నారు. ఆ సమయాల్లో ఎన్నికల ముందు తాను గెలవకపోతే.. రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ చేశారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాట మార్చారు.
కానీ ఎప్పుడు.. ఏ ఎన్నికలు ఎదుర్కొన్నా చంద్రబాబు మాత్రం రాజకీయాల నుంచి వైదొలుగుతాననే సవాల్‌ను.. ఎప్పుడూ చేయలేదు. తొలి సారి ఆయన .. అమరావతి ఇష్యూలో చేశారు. దీనికి ఓ ప్రాతిపతిక ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అమరావతిని మారుస్తానని చెప్పి.. ఎన్నికల్లో గెలిచి.. ఆ ప్రకారం ఇప్పుడు.. నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే.. ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చేది కాదు. కానీ.. జగన్.. అమరావతి మార్చబోనని.. తాను ఇల్లు కూడా కట్టుకున్నానని నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చేయాలనుకున్నది చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా తీసేస్తున్నారు. దీంతో.. తెలుగుదేశం పార్టీ అధినేతకు.. రాజకీయ అస్త్రం ఇచ్చినట్లయింది.
దాన్ని ఆయన పకడ్బందీగా వాడకుంటూ… అధికారపక్షంపై దాడి చేస్తున్నారు. అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన మాటలకు.. ఇప్పుడు చేస్తున్న చేతలకు పొంతన లేకపోవడంతో.. ప్రజల్లోనూ..దీనిపై చర్చ జరుగుతోంది. మరిన్ని మరింత పెంచడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా.. రెఫరెండం డిమాండ్ ను తెరపైకి తీసుకు వస్తున్నారు. తాను ఓడిపోతే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని.. సవాల్ చేస్తున్నారు. మరి అధికారం ఈ సవాల్‌ను వింటుందో..లేదో మరి..!