తమ్మినేని సీతారం.. తాను ముందు ఎమ్మెల్యేలనని.. ఆ తర్వాత స్పీకర్‌నని చెబుతూ.. పదే పదే.. తన రాజకీయ స్వేచ్ఛను ఉపయోగించుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూంటారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగనమోహన్ రెడ్డి కాస్త సీరియస్‌గానే తీసుకున్నట్లుగా ఉన్నారు. ఆయన పనులను కూడా తానే చేయడం ప్రారంభించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలంటూ.. జగన్మోహన్ రెడ్డి స్వయంగా.. ఆదేశాలు జారీ చేశారు. ఇది ఇప్పుడు… కొత్త కలకలం అవుతోంది. రాజధాని మార్పుపై ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చాలనుకున్నది ప్రభుత్వం. ఏ ప్రక్రియ అయినా.. స్పీకర్ ద్వారానే జరగాలి. కానీ స్పీకర్‌ను లెక్కలోకి తీసుకోకుండా.. జగన్మోహన్ రెడ్డి ఈనెల 10న అసెంబ్లీ కార్యదర్శికి ఓ లేఖ పంపించినట్లుగా తెలు్సతోంది.
అందులో.. 20న శాసనసభ, 21న మండలి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఉదయం 10 గంటలకు సమావేశాలు చేపట్టాలని కూడా అందులో స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ లేఖను చూసి.. అసెంబ్లీ వర్గాలు ఏర్పాట్లు ప్రారంభించాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా స్పీకర్ ప్రస్తావన రాలేదు. ఇలా చేయడం.. రాజ్యాంగబద్ధమైన అధికారంలో ఉన్న స్పీకర్ పదవిని అవమానించడమేనన్న చర్చ జరుగుతోంది. మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. నియమాలను అతిక్రమించారని మండిపడ్డారు. నిజానికి రాజ్యాంగంలో ఎవరి అధికారాలు వాళ్లకు ఉంటాయి.
అందరిపై అధికారం ముఖ్యమంత్రికి ఉన్నప్పటికీ… వాళ్ల పనులు .. వాళ్ల అధికారాలను ముఖ్యమంత్రి నేరగా చెలాయించలేరు. వారిని ఆదేశించగలరు. కానీ ఇక్కడ స్పీకర్‌ను.. అధికారికంగా కాకపోయినా.. అనధికారికంగా అయినా.. ఆదేశించే అవకాశం ఉన్నప్పటికీ… తమ్మినేనితో పనేమిటనుకున్నారో కానీ.. తానే స్వయంగా… అసెంబ్లీ ఎప్పుడు సమావేశం కావాలో.. ఏ సమయంలో సమావేశం కావాలో కూడా నిర్దేశించారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోతున్న కోణంలో.. ఇదొక ఘటన మాత్రమేనంటున్నారు.