ఎనిమిదేళ్ల కిందట.. దారుణ అత్యాచారానికి గురై.. కన్నుమూసిన నిర్భయకు ఎట్టకేలకు న్యాయం జరగబోతోంది ఆ దురాగతానికి పాల్పడిన నిందితులకు.. చట్టపరంగా.. ఉరి తప్పించుకోవడానికి ఉన్న అన్ని దారులూ మూసుకుపోయాయి. 22వ తేదీన ఉరి వేయడం ఖాయమయింది. వారు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నిజానికి ఇద్దరు నిందితులు.. తాము ఉరిశిక్షకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. వారు క్షమాభిక్ష కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. వినయ్ కుమార్ శర్మ, ముఖేశ్ సింగ్ ఇద్దరు మాత్రం.. అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలూ చేసుకుంటున్నారు.
దాని వల్ల శిక్ష అమలు ఆలస్యం అవుతోంది కానీ.. ఎక్కడా ఊరట లభించడం లేదు. ఈ నెల 22న ఉదయం 7గంటలకు నలుగుర్ని ఉరి తీయనున్నారు. అయితే ఇప్పటికీ వారికో అవకాశం ఉంది. రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవచ్చు. కానీ.. కొద్ది రోజుల క్రితమే.. నిర్భయలాంటి ఘటనల నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిన అవసరం లేదని.. రాష్ట్రపతి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అందులో నిందితులు పిటిషన్ పెట్టుకున్నా.. కాలహరణం లేకుండా.. దాన్ని తోసిపుచ్చే అవకాశాలే ఉన్నాయి. దేశంలో చట్టాలు.. బాధితులకు సత్వర న్యాయం అందించలేకపోతున్నాయన్న విమర్శలు తరచూ వస్తున్నాయి. తెలంగాణలో దిశ ఘటన జరిగిన తర్వాత .. నిర్భయ ఘటనలో నిందితులకు ఇంత వరకూ శిక్షలు పడలేదని.. దిశకు కూడా.. అలాగే జరుగుతుందని.. నిందితుల్ని తక్షణం ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్లు బలంగా వినిపించారు.
దానికి తగ్గట్లుగా వారు ఎన్కౌంటర్ అయ్యారు. అప్పట్నుంచి మరి.. నిర్భయ కు న్యాయం ఎప్పుడు జరుగుతుందనే చర్చ జరుగుతోంది. నిర్భయ తల్లిదండ్రులు కూడా.. అదే ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చివరికి.. ఎనిమిదేళ్ల తర్వాత… నిర్భయ నిందితులకు శిక్ష పడబోతోంది. దీని ద్వారా.. నిర్భయకు న్యాయం జరుగుతుందో లేదో చెప్పలేము కానీ.. చట్టంపై కాస్త నమ్మకం పెరిగే అవకాశం మాత్రం ఉంది.