తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్… ఈ మధ్య కొంతమంది మంత్రులు వరుసగా ఇదే అంశాన్ని మాట్లాడుతూ చర్చనీయం చేశారు. ఇంకాస్త ముందుకెళ్లి.. ఫిబ్రవరి నెలలో ముహూర్తం ఖాయమైపోయిందని కూడా కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చేశాయి. వీటన్నింటిపై మరోసారి స్పష్టత ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇదే అంశంపై మాట్లాడారు.
పండుగ వేళ కాబట్టి ఓ విషయాన్ని స్పష్టం చేయదల్చుకున్నా, నాకు అలాంటి (సీఎం పదవి) అత్యాశలు లేవన్నారు కేటీఆర్. పెద్దపెద్ద పదవులు కావాలన్న ఆరాటాలు, గొంతెమ్మ కోరికలు ఏమీ లేవన్నారు. నెనెక్కడున్నానో అక్కడ సంత్రుప్తిగానే ఉన్నా అన్నారు. ప్రజలు కోరుకుంటున్నారు, ఇంకెవరో డిమాండ్ చేస్తున్నారన్నది కరెక్ట్ కాదన్నారు. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకున్నారు, ప్రజల్లో ఒకడిగా తానూ అదే కోరుకుంటున్నా అన్నారు. మరో పది పదిహేనేళ్లపాటు ఈ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా అన్నారు. సో… పార్టీలో జరుగుతున్న చర్చకు మరోసారి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం కేటీఆర్ చేశారు. కనీసం ఇకనైనా దీని గురించి నేతలు ప్రకటనలు చేయడం మానుకుంటారేమో చూడాలి. గతసారి కూడా ఇలానే చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తే.. ఆ మర్నాడే మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మళ్లీ తెరమీదికి తెచ్చారు.
మున్సిపల్ ఎన్నికల గురించి కేటీఆర్ మాట్లాడుతూ… మెజారిటీ స్థానాలు తెరాస గెలుచుకోవడం ఖాయమన్నారు. తెరాసలో రెబల్స్ ఇబ్బందికరంగా తయారయ్యారు కదా అంటే… దాన్ని పాజిటివ్ గా చూడాలని, తమ పార్టీ నుంచి పోటీ పడేందుకే చాలామంది ముందుకొస్తున్నారంటే అది సానుకూలాంశమే అన్నారు. రెబెల్స్ కి సొంత పార్టీ నుంచే కొందరు మద్దతుపలుతున్నారు కదా అంటే… అన్ని పార్టీల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయనీ, వీటన్నింటినీ సానుకూలంగానే చూస్తున్నామన్నారు. అంతేకాదు… ఈ ఎన్నికలు తన పనితీరుకు రాబోతున్న తీర్పుగా చూస్తున్నా అన్నారు. మంత్రిగా తాను చేసిన పనులకు ప్రజలు ఇవ్వబోతున్న తీర్పు అనీ, దీనికి పూర్తి బాధ్యత తానే వహిస్తానన్నారు. రెబెల్స్ బెడద కూడా లేదన్నట్టుగానే కేటీఆర్ మాట్లాడారు.