స్థానిక సంస్థల ఎన్నికలు వాస్తవానికి ఏడాది కిందటే జరగాలి. జనరల్ ఎలక్షన్స్‌కు ముందే.. ఈ ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. కానీ అప్పటి టీడీపీ సర్కార్.. ఎన్నికలు ముగిసిన వెంటనే నిర్వహించాలని అనుకుంది. స్థానిక ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని.. టీడీపీ భయపడటమే కారణం. స్థానిక ఎన్నికలు జరగకపోయినా.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రాలేదు. అది వేరే విషయం. కానీ.. సన్నాహాలు మాత్రం.. ఆ ప్రభుత్వం పూర్తి చేసింది. కొత్త ప్రభుత్వం 8 నెలలు అయినప్పటికీ.. వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతోంది.
151మంది ఎమ్మెల్యేలున్నా స్థానిక ఎన్నికలంటే టెన్షనేనా..?
అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు సాధించింది. అంటే.. మామూలు విషయం కాదు. ప్రజాభిప్రాయం ఏకపక్షంగా ఉన్నట్లే. ఆ ఊపులో.. ఎవరైనా.. అంతా రెడీగా ఉన్న… స్థానిక ఎన్నికలు నిర్వహించి… స్వీప్ చేయాలనుకుంటారు. కానీ విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి.. స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి వెనుకంజ వేశారు. నిజానికి అప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలనే ఆదేశాలున్నప్పటికీ.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమని.. మరోటని సాకుగా చెబుతూ.. కాలయాపన చేస్తూ వచ్చారు. చివరికి హైకోర్టు తుది హెచ్చరికల తర్వాత నిబంధనలకు విరుద్ధంగా… 59శాతానికిపైగా రిజర్వేషన్లు ఖరారు చేసి.. హైకోర్టుకు షెడ్యూల్ సమర్పించారు. దీనిపైనా.. హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఎన్నికలు నిర్వహించాలని తామే ఆదేశించాం కాబట్టి.. హైకోర్టు స్టే ఇవ్వలేకపోయింది. అయితే.. వైసీపీ పెద్దలకు సన్నిహితులైన రెడ్డి సంక్షేమసంఘం నేతలతో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయించి.. స్టే తీసుకు వచ్చారు.
కొత్త ప్రభుత్వ క్రేజ్‌ను కూడా ఓట్లుగా చేసుకోలేమని భయపడ్డారా..?
ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సాధారణంగా.. ఓ క్రేజ్ ఉంటుంది. ప్రజల్లో సానుకూలత ఉంటుంది. ఆ క్రమంలో ఎలాంటి ఎన్నికలైనా నిర్వహించి.. మొత్తంగా గెలుచుకోవాలని అధికార పార్టీలు ఆరాట పడుతూటాయి. 50శాతానికిపైగా ఓట్లు సాధించిన సందర్భంలో అయితే.. అసలు వెనుకడుగు వేయవు. కానీ వైసీపీ తీరు మాత్రం.. సందేహాస్పదంగా ఉంది. తమ మార్క్ పాలన చూపి.. ఎన్నికల్లో గెలుద్దామనుకున్నారో.. లేక స్థానిక ఎన్నికలు బ్యాలెట్‌తో పెట్టాల్సి వస్తుందని సందేహించారో కానీ.. వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఎనిమిది నెలల పాలనలో.. అంతా తిరోగమనం ఏర్పడింది. ప్రజలు అందరిపై ఆర్థికంగా భారంపడే నిర్ణయాలు జగన్ తీసుకున్నారు. ఇప్పుడు… సానుకూలత కన్నా.. వ్యతిరేకత ఎక్కువగా కనిపించే పరిస్థితులు ఉన్నాయి. అందుకే.. జూన్ వరకూ ఆగాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఎంత ఆలస్యం చేస్తే అంత చేటు అని గుర్తించలేకపోతున్నారా..?
ప్రభుత్వం అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాలతో… కింది స్థాయి వరకూ ప్రజలు ప్రభావితం అవుతున్నారు. స్థానిక ఎన్నికల్లో.. స్థానిక విషయాలే హైలెట్ అవుతాయి. కానీ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు… ప్రజల జీవన ప్రమాణల్నే.. మార్చేస్తున్నాయి. అందుకే.. వైసీపీ పెద్దలు కలవరపడుతున్నట్లుగా తెలుస్తోంది. రాను రాను ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది. ఊహించనంత ఆర్థిక లోటు ఇప్పటికే ఏర్పడింది. దీన్ని హ్యాండిల్ చేయకపోతే.. ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించాల్సి ఉంటుంది. అదే జరిగితే.. వైసీపీ ఇక ఎన్నికలను ఎదుర్కోవడం కష్టం అవుతుంది.