రాజధాని గ్రామాల్లో పోలీసులు రాత్రి పూట మరోసారి కలకలం రేపారు. ఈ సారి కవాతు సోదాలలతో కాకుండా… రైతులను బతిమాలుకోవడానికి వచ్చారు. తాము 144 సెక్షన్ , యాక్ట్ 30 అమలు చేయడం ద్వారా గ్రామస్తులను ఎలాంటి ఇబ్బంది పెట్లలేదని పోలీసులు వాదించారు. ఎవరినీ కొట్టలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇవే మాటల్ని.. కాగితాలపై రాసుకొచ్చి.. కొంత మంది సంతకాలు తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. రైతులు మాత్రం.. సంతకాలు పెట్టేది లేదని తెగేసి చెప్పినట్లుగా తెలుస్తోంది. రాజధాని విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. మీడియా కథనాలను సాక్ష్యాలుగా తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించింది.
ఈ క్రమంలో హైకోర్టుకుపూర్తి వివరాలు సమర్పించాల్సి ఉన్న సమయంలో.. పోలీసు అధికారులు… మళ్లీ రైతుల వద్దకే వెళ్లారు. హైకోర్టు ఆదేశించే చర్యల నుంచి తప్పించుకోవడానికి … తాము కొట్టలేదని.. రాసివ్వాలని… కొట్టిన రైతుల వద్దకే వెళ్లి బతిమాలుతున్నారు పోలీసులు. 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30తో ఇప్పటికీ.. రాజధాని గ్రామాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సెక్రటేరియట్‌కు వెళ్లే పని ఉంటే.. గ్రామం మొత్తం నిర్బంధానికి గురవుతోంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ పోలీసులు .. తమ వల్ల ఇబ్బంది పడలేదని రైతులతోనే చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాము ప్రభుత్వం చెప్పిందని.. చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించామని పోలీసులు రాజధాని గ్రామాల్లో రైతులను బతిమాలడం ద్వారా.. పోలీసులు అంగీకరించినట్లయింది. అయితే.. రైతులు మాత్రం … పోలీసుల విషయంలో.. తాము మెత్తగా ఉండే అవకాశం లేదని.. వారు తమను పెట్టిన హింస.. అంత తేలిగ్గా మర్చిపోబోమని అంటున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన కొంత మంది సీనియర్ పోలీసు అధికారులు… హైకోర్టు ఆగ్రహానికి గురి కావడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే… పోలీసులు రైతుల వద్దకు కాళ్ల బేరానికి వచ్చారని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి.