ఎన్నికల సమయంలోనే పొత్తుల గురించి ఆలోచిస్తూంటాయి రాజకీయ పార్టీలు. ఎందుకంటే.. రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు.. ఎలా మారిపోతాయో.. అంచనా వేయడం కష్టం. కానీ.. రాజకీయాల్లో భిన్నత్వాన్ని చూపిస్తున్న పవన్ కల్యాణ్… ఎన్నికలు అయిపోయిన ఎనిమిది నెలల్లోనే కొత్త పొత్తులకు శ్రీకారం చుట్టారు. తనది కమ్యూనిస్టు మనస్థత్వమని.. కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన… చేదు ఫలితాల్ని రుచి చూశారు. ఆ తర్వాత సొంతంగా పార్టీని నిర్మించుకునేందుకు ప్రయత్నాలు చేశారు కానీ.. ఎక్కడా పొత్తుల గురించి చెప్పలేదు. హఠాత్తుగా… ఆయన పొత్తుల గురించి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశం మధ్యలోనే.. ఢిల్లీ వెళ్లి దీనిపై చర్చించారు. పొత్తులను ఖరారు చేసుకున్నారు.
ఇకపై.. ఒకే మాట.. ఒకే బాటగా నడవాలని.. రెండు పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చాయి. ముందుగా.. వీరు.. అమరావతి విషయంలో ఏకాభిప్రాయం సాధించారు. మిగిలిన అంశాలపై నేటి సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. విజయవాడలోని ఓ స్టార్ హోటల్లో జరగనున్న సమావేశం తర్వాత రెండు పార్టీల నేతలు ఉమ్మడి కార్యాచరణ ప్రకటించనున్నారు. పవన్ తో పొత్తు విషయంలో ఏపీ బీజేపీ నేతలు ఎవరూ ఎలాంటి వ్యతిరేక ప్రకటనలు చేయడం లేదు. అలాగని అనుకూల ప్రకటనలు చేయడం లేదు. అంతా హైకమాండ్ ఇష్టమని… చెబుతున్నారు.
జనసేనతో ఎలాంటి బంధం ఉండాలన్నదానిపై చర్చించేందుకు రాంమాధవ్, సునీల్ ధియోధర్ విజయవాడ చేరుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాతో పాటు.. పలువురు నేతలతో ముందుగా వీరు భేటీ అవుతారు. ఎజెండాను ఖరారు చేసి.. జనసేన నేతలతో భేటీ అవుతారు. ఆ వివరాలను.. అక్కడ్నుంచే అమిత్ షాకు తెలియజేస్తారు. అమిత్ షా అప్రూవల్ వచ్చిన తర్వాత.. సంయుక్తంగా ప్రెస్మీట్ పెట్టే అవకాశం ఉంది. జనసేన పార్టీ ప్రస్తుతం అమరావతి రైతుల్ని ఆదుకోవాలనే మిషన్ పెట్టుకుంది. దీని కోసమే బీజేపీతో కలుస్తున్నట్లుగా భావిస్తున్నారు. కేంద్రం జోక్యం చేసుకుని అమరావతి రాజధాని తరలిపోకుండా.. ఆపితే.. బీజేపీతో జనసేన బంధం ధృడంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. లేకపోతే మళ్లీ ప్రత్యర్థులైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.