2024 ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా.. పొత్తులు పెట్టుకుంటున్నామని బీజేపీ , జనసేన ప్రకటించాయి. నాలుగున్నరేళ్ల పాటు కలిసి.. కష్టపడి ప్రజాపోరాటాలు చేసి.. అధికారం సాధిస్తామని.. ఉభయ పార్టీల ముఖ్య నేతలుధీమా వ్యక్తం చేశారు. నాలుగు రోజుల కిందట.. ఢిల్లీలో జేపీ నడ్డాను కలిసి పొత్తులను ఖరారు చేసుకున్న పవన్ కల్యాణ్… ఈ రోజు విజయవాడలో.. రాష్ట్ర నేతలతో చర్చల తర్వాత అధికారికంగా ప్రకటించారు. అంతకు ముందు రెండు పార్టీల నేతల మధ్య.. వివిధ అంశాలపై చర్చలు జరిగాయి. ఓ దశలో విలీన ప్రస్తావన కూడా వచ్చింది. కానీ విలీనం అయితే.. జనసేన కార్యకర్తలు ..బీజేపీతో కలుస్తారని నమ్మకం లేదన్న అభిప్రాయం ఇరు వర్గాల్లోనూ రావడంతో.. పొత్తులకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. సమావేశం తర్వాత.. ఇరు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. ఏపీ భవిష్యత్, రాష్ట్ర ప్రయోజనాల కోసం… బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని పవన్‌కల్యాణ్ ప్రకటించారు.
జనసేన-బీజేపీ భావజాలం ఒక్కటిగానే ఉందన్నారు. ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందని .. కేంద్రంలో బలమైన ప్రభుత్వం వల్ల ఏపీకి లాభమని పవన్ చెప్పుకొచ్చారు. గతంలో.. బీజేపీతో మనస్ఫర్థలు వచ్చాయని.. వాటిని సర్దుబాటు చేసుకున్నామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. 2024లో బీజేపీ-జనసేన అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. రెండుపార్టీల మధ్య సమన్వయం కోసం కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకుంటామన్నారు. రాజధాని విషయంలోనూ.. సమావేశంలో చర్చ జరిగింది. రెండు పార్టీలు.. అమరావతి కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాయి. రాజధాని విషయంలో వైసీపీ ఏకపక్షంగా ముందుకెళ్తే చూస్తూ ఊరుకోమని బీజేపీ, జనసేన .. వైసీపీని హెచ్చరించాయి. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని అమరావతిని స్వాగతించారని.. అవసరమైతే క్షేత్రస్థాయిలో పోరాడతామని పవన్ ప్రకటించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం బీజేపీ-జనసేనతోనే సాధ్యమని కన్నా విశ్వాసం వ్యక్తం చేశారు. వైసీపీ నియంతృత్వ ధోరణిపై… గతంలో టీడీపీ చేసిన అవినీతిపై కలిసి పోరాడతామన్నారు.
జగన్ ఏకపక్షంగా ముందుకెళ్తారని అనుకోవడంలేదని చెప్పుకొచ్చారు. జనసేనతో కలిసి ఏపీలో అద్భుత రాజకీయ ఫలితాలు సాధిస్తామని జీవీఎల్… ఏపీలో కుల, వారసత్వ రాజకీయాలను అంతమొందిస్తామని సునీల్ ధియోధర్ ప్రకటించారు. ప్రత్యేకహోదా అంశాన్ని పవన్ కల్యాణ్.. బీజేపీ నేతలతో జరిగిన చర్చల్లో తీసుకు రాలేదు. మీడియా అడిగితే.. గతంలో చంద్రబాబు ప్యాకేజీ తీసుకోకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. అంతిమంగా.. 2014లో ఏర్పడిన బీజేపీ – జనసేన పొత్తు.. మళ్లీ 2020లో .. సాకారం అయింది. కమ్యూనిస్టు పార్టీలకు తాను బాకీ లేదని.. పనిలో పనిగా పవన్ క్లారిటీ ఇచ్చేశారు.