మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల అభ్యర్థులను భాజపా నిలబెట్టలేకపోయింది. దానికి కారణమేంటో చెప్పారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. అధికార పార్టీ తెరాస బెదిరింపులేనట. ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… చాలా చోట్ల బెదిరింపులకు పాల్పడి, కేసులు పెడతామని భయపెట్టి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి కొన్ని చోట్ల నామినేషన్లను ఉపసంహరించేలా చేశారంటూ లక్ష్మణ్ ఆరోపించారు. అధికార పార్టీగా తాను ఏదైనా చెయ్యొచ్చు అన్నట్టుగా కేసీఆర్ అనుకుంటే అంతిమంగా ఇబ్బందులు తప్పవన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.
భాజపాకి బలం లేకనే కొన్ని చోట్ల టీడీపీతో, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ తో లోపయికారీగా కలిసి పోటీ చేస్తోందన్న విమర్శలు అర్థం లేనివన్నారు. తెరాస పార్టీకి భాజపా అంటే గుబులూ భయమూ చాలా ఉందన్నారు. లేకపోతే, తమ పార్టీ అభ్యర్థుల్ని తీసుకుపోయి టిక్కెట్లు ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు? భాజపా, కాంగ్రెస్ కలిశాయని కేటీఆర్ అంటున్నారనీ, భాజపా, తెరాస కలిశాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారనీ, అంటే భాజపా బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోందని భావించాలన్నారు. నేరుగా ఎదుర్కోలేరు కాబట్టే ఇలాంటి విమర్శలు చేస్తున్నారన్నారు. నిజం చెప్పాలంటే.. కాంగ్రెస్, తెరాస, ఎం.ఐ.ఎం. ఒకటేనని సి.ఎ.ఎ. అంశంలో స్పష్టమౌతోందన్నారు లక్ష్మణ్. భైంసాలో మజ్లిస్ ఎలా ఏకగ్రీవమైందనీ, అక్కడ కాంగ్రెస్, తెరాసలు మద్దతు ఇవ్వకపోతే ఎలా సాధ్యమన్నారు. మతపరమైన రాజకీయాలను చేస్తున్నదే వీళ్లని విమర్శించారు.
తెరాస బెదిరింపులు, ప్రలోభాల వల్లనే భాజపాకి అభ్యర్థులు తగ్గారని లక్ష్మణ్ తేల్చేశారు. నిలబెట్టలేని తమ వైఫల్యాన్ని ఒప్పుకోవట్లేదు. భాజపా బలాన్ని తెరాస బెదిరింపుల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఇలా తిప్పితిప్పి మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయిగానీ, అంతిమంగా ఎన్నికల్లో గెలుపు ముఖ్యం. అన్ని చోట్లా అభ్యర్థులను నిలబెట్టుకోలేకపోవడంలో భాజపా కొంతమేరకు విఫలమైందన్నది వాస్తవం. తెరాసకు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్నప్పుడు.. ఆ పార్టీ తమని ఏరకంగా ప్రభావితం చేయలేదన్నది చెప్పాలి. అంతేగానీ, ఇలా తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చడం కోసం తెరాస మీద నెపాన్ని నెట్టడం వల్ల భాజపాకి ఏరకంగానూ ఉపయోగపడేట్టు కనిపించడం లేదు. ఓరకంగా తెరాస బలాన్ని ఒప్పుకుంటున్నట్టుగానూ ఉంది.