కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి లో నిర్వహించే డిబేట్ ప్రోగ్రాం ప్రేక్షకులలో, ప్రత్యేకించి వైఎస్ఆర్సిపి అభిమానులలో బాగా ప్రాచుర్యం పొందిన కార్యక్రమం. అయితే రాష్ట్రంలో జరిగే ప్రతి రాజకీయ అంశాన్ని జగన్ కి అనుకూలంగా, వైయస్సార్సీపి పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా చర్చను నిర్వహించడం ఈయన ప్రత్యేకత. చర్చకు వచ్చే ఆహ్వానితులను కూడా కనీసం సగానికి పైగా ఉంది వైఎస్సార్సీపీని సమర్థించే వారు ఉండేలా చూసుకోవడం, తద్వారా ఎక్కువ మంది వైఎస్ఆర్సిపి వైఖరిని సమర్థిస్తున్నారు అన్న అభిప్రాయం కలిగేలా చేయడం ఆయన వర్కింగ్ స్టైల్.
పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఏం చేసినా, అందులో రంధ్రాన్వేషణ చేసి మరీ ఆ కార్యక్రమాన్ని తప్పుపట్టడం కొమ్మినేని డిబేట్ లో సాధారణంగా జరిగేదే. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్ల క్రిందట మోడీ ని నిలదీసినప్పుడు, ఉద్దానం సమస్యను వెలుగులోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినప్పుడు దాన్ని సమర్థించని కొమ్మినేని, ఇటీవల ఏర్పడ్డ బిజెపి జనసేన పొత్తును తీవ్రంగా ఖండించడం కోసం మాత్రం వెంటనే డిబేట్ నిర్వహించారు. పవన్ నిర్ణయాలు నిలకడ లేకుండా ఉన్నాయని, పవనిజానికి కాషాయం వేశారని, పవన్ నిర్ణయాల వల్ల ఆయన అభిమానుల లో తీవ్ర గందరగోళం ఆందోళన నెలకొందని ఇలా ఆయన కి తోచినట్లు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ క్రమంలో రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవటం అత్యంత సాధారణ విషయం అనే అభిప్రాయం ఇతరుల నుండి వెలువడడంతో, పొత్తు గురించి తాను తప్పు పట్టనని, కానీ బేషరతుగా పొత్తు పెట్టుకుంటున్నాము అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తప్పు పడుతున్నానని, బీజేపీకి తన వైపు నుండి రాష్ట్రం కోసం షరతులు పెట్టే ధైర్యం పవన్ చేయలేక పోయారని అని కొమ్మినేని వ్యాఖ్యానించారు.
అయితే కొమ్మినేని చేసిన వ్యాఖ్యలకు వచ్చిన సమాధానం ఆయన ని గూగ్లీ తినేలా చేసింది. ఎన్నికలకు ముందు తనకు 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా చేస్తానని వ్యాఖ్యానించిన జగన్, కనీసం ప్రమాణస్వీకారం కూడా చేయకుండానే కేంద్రానికి లొంగిపోయాడని ప్రత్యేక హోదా విషయమై తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు అని, ఇది కూడా బిజెపికి లొంగి పోవడం లాంటిదే అని సాక్షి డిబేట్లో నే ఇతరులు వ్యాఖ్యలు చేయడం కొమ్మినేని ని తీవ్ర డిఫెన్స్ లో పడవేసింది. దాన్ని సమర్థించుకోవడానికి ఆయన పడరాని పాట్లు పడ్డారు. జగన్ కు ఎంతో ధైర్యం ఉంది కాబట్టి “ప్రత్యేక హోదా విషయంలో తాము ఏమీ చేయలేమని” వ్యాఖ్యానించారు అని, “ఇది మన ఖర్మ” అని జగన్ వ్యాఖ్యానించడ మే ఆయన ధైర్యానికి నిదర్శనమని ఒక హాస్యాస్పదమైన లాజిక్ ప్రదర్శించారు కొమ్మినేని.
మొత్తానికి, ఎంతో పకడ్బందీగా, తమకు అనుకూలమైన ఆహ్వానితులను మాత్రమే పిలిచి, తమకు కావలసిన కాల్స్ మాత్రమే తీసుకుని కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ, అప్పుడప్పుడు ఇలాంటి గూగ్లీ లు కొమ్మినేని కి తగులుతూనే ఉన్నాయి.