అమరావతి విషయాన్ని ఏపీ సర్కార్ క్లైమాక్స్‌కి తీసుకొచ్చింది. అదే సమయంలో…విపక్షాలు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నాయి. మూడు రాజధానుల విషయంలో.. హైపవర్ కమిటీ… శుక్రవారం.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో భేటీ కానుంది. ఇప్పటికే మూడు సార్లు హైపవర్ కమిటీ భేటీ అయింది. కమిటీ సభ్యుల అభిప్రాయాలతో.. నివేదికను ఫైనల్ చేసే అవకాశం ఉంది. నివేదికలో ఏమి ఉండాలన్నది.. ఇప్పటికే.. ప్రభుత్వానికి క్లారిటీ ఉంది కాబట్టి.. రైతులకు ఏం చేయాలన్నదానిపై చర్చించే అవకాశం ఉందంటున్నారు. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తే.. వచ్చే న్యాయపరమైన వివాదాలపైనా హైపవర్ కమిటీ చర్చించే అవకాశం ఉంది. ఇరవయ్యో తేదీన ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించాలని ఇప్పటికే తేదీని ఖరారు చేసినందున… హైపవర్ కమిటీ భేటీ చివరిది కావడం ఖాయంగా కనిపిస్తోంది.
అదే సమయంలో.. రాజధాని రైతులు తమ అభిప్రాయాలు చెప్పవచ్చు అంటూ.. ప్రభుత్వం విధించిన గడువు కూడా రేపటితో ముగియనుంది. మరో వైపు.. విపక్ష పార్టీలు.. అమరావతి పోరాటం విషయంలో స్పీడు పెంచుతున్నాయి. గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని.. చంద్రబాబు, అమరావతి జేఏసీ నిర్ణయించాయి. రాజకీయ దురుద్దేశంతోనే అమరావతిని దెబ్బతీస్తోందని చంద్రబాబు, జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓ వైపు అమరావతిని కాపాడుకుంటామంటూ.. బీజేపీ, జనసేన కలిసిపోవడం.. మరో వైపు రాష్ట్ర వ్యాప్త పోరాటంతో.. ప్రభుత్వం ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
హైకోర్టులోనూ… అమరావతి ఆందోళనలపై విచారణ జరగనుంది. అమరావతిలో 144 సెక్షన్ విధింపు, పోలీసుల తీరును తప్పుబడుతూ హైకోర్టులో 9 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టు… పోలీసులపై చర్యలకు ఆదేశించింది. పిటిషన్లపై శుక్రవారమే విచారణ జరగనుంది. ఈ పరిణామాలన్నింటితో.. శుక్రవారం.. అమరావతిలో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే మూడు రోజుల పాటు.. అమరావతిలో టెన్షన్ .. టెన్షన్‌గా గడవనుంది.