భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తులపై స్పందించాల్సిన అవసరమే లేదని.. తెలుగుదేశం పార్టీ ఓ నిర్ణయానికి వచ్చింది. ఓ వైపు అధికార పార్టీ.. ఆ పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్‌పై మండి పడుతూంటే.. టీడీపీ మాత్రం తేలిగ్గా తీసుకుంది. ఇప్పటికిప్పుడు స్పందిచాల్సిన అవసరం లేదని.. పూర్తిగా రాజధాని ఉద్యమంపై దృష్టి కేంద్రీకరించాలని.. హైకమాండ్ పార్టీ నేతలకు స్పష్టమైన సందేశం పంపింది. పవన్ కల్యాణ్.. బీజేపీతో కలవడం .. అదీ ఈ సమయంలో కలవడం వెనుక ఖచ్చితంగా రాజకీయం ఉందని.. అది .. వైసీపీకే ఎక్కున నష్టం చేస్తుందన్న అభిప్రాయంతో.. టీడీపీ నేతలు ఉన్నారు.
జగన్ కేసులనూ..ఇంత కాలం కేంద్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోందని.. ఇక ముందు.. అలా చూడకుండా.. ఒత్తిడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంక్ చాలా పటిష్టంగా ఉందని.. ఆ రెండు పార్టీల పొత్తుల వల్ల.. తమ క్యాడర్ ఎవరూ ఆకర్షితులయ్యే అవకాశం లేదని అంచనాకొచ్చారు. రాజధాని ఉద్యమం విషయంలో.. ప్రజల్లో.. ఓ స్పష్టత వచ్చిందని… జగన్మోహన్ రెడ్డి.. గతంలో అంగీకరించి.. ఇప్పుడు.. కారణాలు లేకుండా.. రాజధాని తరలింపు ప్రయత్నాలు చేయడం వెనుక కుట్ర ఉందని ప్రజలు నమ్ముతున్నారని టీడీపీ భావిస్తోంది.
ఇలాంటి సమయంలో.. బీజేపీ, పవన్ కల్యాణ్ పొత్తులకు లేనిపోని ప్రాధాన్యత ఇచ్చి విమర్శలు చేయడం ద్వారా.. ఉద్యమం పక్కదారి పడితే.. రైతులకు అన్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. అయితే.. టీడీపీలోని కొన్ని వర్గాలు మాత్రం.. వచ్చే ఎన్నికల నాటికి.. విపక్ష పార్టీలన్నీ.. ఏకతాటిపైకి రావాల్సిన పరిస్థితులు వస్తే.. ఆయా పార్టీలు… టీడీపీ దగ్గరకు రావాల్సిందేనని.. గుర్తు చేస్తున్నారు. టీడీపీ వైపు నుంచి మాత్రం… ఎలాంటి చొరవ ఉండదని అంటున్నారు.