అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆయన వేస్తున్న అనేకానేక పిటిషన్లు.. విచారణ అనంతరం కొట్టివేతకు గురవుతున్నాయి. గతంలోనే వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ను కొట్టి వేసిన సీబీఐ కోర్టు ఈ రోజు.. మరో రెండు పిటిషన్లను కొట్టివేసింది. అందులో ఒకటి.. సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ పూర్తయిన తర్వాతే.. ఈడీ కేసుల విచారణ చేయాలన్న పిటిషన్ ఒకటి. మరొకటి.. దాఖలు చేసిన ఐదు డిశ్చార్జ్ పిటిషన్లను కలిపి విచారణ చేయాలన్నది. ఈ రెండింటిని సీబీఐ కోర్టు కొట్టి వేసింది.
తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. జగన్మోహన్ రెడ్డి.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్విడ్ ప్రో కో ద్వారా పెద్ద ఎత్తున .. వేర్వేరు సంస్థల నుంచి పెట్టుబడులు సేకరించారు. రూపాయి విలువ చేయని షేర్లను వందల కోట్లకు అమ్మారు. ఫలితంగా.. వారికి ప్రభుత్వం నుంచి లబ్ది కలిగించారు. వీటిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ క్విడ్ ప్రో కో లావాదేవీల్లో డబ్బులన్నీ మనీలాండరింగ్ ద్వారానే సమకూరినట్లుగా తేలడంతో.. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కూడా.. కేసులు నమోదు చేసింది. విచారణ సమాంతరంగా జరుగుతోంది. ఈడీ పలు ఆస్తులను జప్తు చేసింది కూడా. జగన్.. సీబీఐ కేసుల విచారణ పూర్తయ్యే వరకూ.. ఈడీ కేసుల విచారణ ఆగిపోవాలని కోరుకుని పిటిషన్ వేశారు. దాన్ని కోర్టు తోసిపుచ్చింది.
అలాగే.. సీబీఐ నమోదు చేసిన వివిధ కేసుల నుంచి తమను తప్పించాలంటూ.. ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపైనా.. విచారణ జరుగుతోంది. అయితే.. ఈ ఐదు పిటిషన్లను కలిపి విచారణ చేయాలంటూ.. జగన్ మరో పిటిషన్ దాఖలుచేశారు. దాన్ని కూడా సీబీఐ కోర్టు కొట్టి వేసింది. ఈ ఐదు డిశ్చార్జ్ పిటిషన్లను.. కోర్టు విడివిడిగా విచారిస్తుంది. కేసులు నమోదు చేసి.. ఏళ్లు గడిచిపోతున్నా.. అక్రమాస్తుల కేసుల్లో విచారణ మాత్రం.. పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. దీనికి జగన్మోహన్ రెడ్డి వేస్తున్న.. పిటిషన్లే కారణమని.. సీబీఐ ఆరోపణలు గుప్పిస్తూ వస్తోంది. ఈ క్రమంలో.. జగన్ వేసిన పిటిషన్లన్నీ వరుసగా కొట్టివేతగా గురవుతున్నాయి. దీంతో.. జగన్ కేసుల విచారణ వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోందంటున్నారు.