తొలి వన్డే పరాజయానికి టీమిండియా బదులు తీర్చుకుంది. రెండో వన్డేలో ఘన విజయం సాధించింది. రెండో వన్డేలో టీమిండియా జాగ్రత్త పడింది. భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచినప్పటికీ ఎక్కడా ఉదాసీనతకు తావివ్వకుండా.. ఘన విజయాన్ని సాధించింది. రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో.. టీమిండియా ఆటగాళ్లు ఆల్ రౌండ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ధావన్, కోహ్లీ, కేఎల్ రాహుల్ ఒకరి తర్వాత ఒకరు బ్యాట్ ఝుళిపించారు. ఓపెనర్ రోహిత్ శర్మ కూడా.. మెరుపులు మెరిపించారు. రోహిత్ శర్మ.. అత్యంత వేగంగా వన్డేలో ఏడు వేల పరుగులు చేసిన ప్రపంచరికార్డును కూడా ఈ మ్యాచ్‌తో అధిగమించారు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ నాలుగు పరుగుల తేడాతో సంచరీని కోల్పోయారు.
కోహ్లీ 78, రాహుల్ 80 పరుగులు చేసి.. భారత్ స్కోరును 340కి చేర్చారు. 341 పరుగుల లక్ష్యం.. భారీదే అయినప్పటికీ.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌తో పోలిస్తే చిన్నదే. మొదటి వన్డేలో వికెట్ నష్టపోకుండా.. వార్నర్, ఫించ్ కొట్టిన గెలుపు టీమిండియా మర్చిపోయే పరిస్థితి లేదు. వార్నర్ , ఫించ్, స్మిత్, లబూషన్ వంటి బ్యాటింగ్ మాస్టర్లతో నిండిపోయిన ఆస్ట్రేలియా లైనప్ .. కొట్టేస్తుందని అనుకున్నారు. కానీ టీమిండియా అటు బౌలింగ్ లో ఇటు ఫీల్డింగ్ లోనూ పట్టుదల ప్రదర్శించారు.
తొలి వన్డేలో రచ్చ చేసిన వార్నర్, ఫించ్.. ఈ సారి 20 పరుగుల వద్దే విడిపోయారు. తర్వాత స్మిత్ తప్ప ఏ ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ నిలకడ చూపించలేకపోయారు. స్మిత్ 98 పరుగులు చేసి ఔటయ్యారు. షమీ మూడు వికెట్లు తీయగా.. సైని, జడేజా, కుల్దీప్ రెండేసి వికెట్లు పడగొట్టారు. బుమ్రా ఒక్క వికెట్ తో సరి పెట్టుకున్నారు. ఈ గెలుపుతో సిరీస్ 1-1తో సమం చేసింది టీమిండియా. మూడో వన్డేలో గెలిచిన వారే.. సిరీస్ విన్నర్.