తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో తప్పుకుంటారు. ఈ పదవి కోసం రేసులో ఉన్నవారు ఎంతమందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఉత్తమ్ వర్గ నేతగా పేరున్న సీనియర్ నేత వీ హన్మంతరావు కూడా ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి తనకే కావాలంటూ మాట్లాడటం కొంత చర్చకు దారి తీస్తోంది. రేవంత్ రెడ్డిని ద్రుష్టిలో పెట్టుకుని కొత్తగా చేరినవారికి పదవి ఇవ్వకూడదనీ, సీనియర్లలో ఎవరికిచ్చినా ఫర్వాలేదంటూ వచ్చిన వీహెచ్… ఇప్పుడు తనకే కావాలంటున్నారు. తనకే ఎందుకూ అనేదానికి కారణాలూ చెప్పారు.
బీసీల ఓటు బ్యాంకు కోసమైనా తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్నారు. బీసీల కోసం ఆత్మ గౌరవ భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టిస్తున్నారనీ, కాంగ్రెస్ వెంట బీసీలుండాలంటే కీలక పదవి తనకు ఇవ్వాలన్నారు. తనకు వయసు ఎక్కువైపోయిందని కొంతమంది అంటున్నారని ఆరోపించారు. కర్ణాటకలో మాదిరిగా ఇక్కడ కూడా అభిప్రాయ సేకరణ చేశాకే పీసీసీ పదవి ఇవ్వాలని అధినాయకత్వాన్ని కోరినట్టు వీహెచ్ అన్నారు. అయితే, కీలక పదవి తనకే కావాలంటూ ఇప్పుడు వీహెచ్ డిమాండ్ చేస్తుండటం వెనక అసలు కారణం మరొకటి ఉందని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద వీహెచ్ కోపమే దీనికి కారణమట. ఎలా అంటే, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సీనియర్ నేతల్ని పార్టీ ఇన్ ఛార్జులుగా నియమించిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్ర స్థాయి నాయకుడైన తనని మున్సిపల్ స్థాయికి పరిమితం చేస్తారా అంటూ ఉత్తమ్ మీద వీహెచ్ అసంత్రుప్తికి గురయ్యారని ఈ మధ్యనే కథనాలు వచ్చాయి. అంతేకాదు, ఆ మధ్య వీహెచ్ తో ఇందిరా పార్క్ దగ్గర గొడవ పెట్టుకుని సస్పెండ్ అయిన నగేష్ అనే కాంగ్రెస్ నేతపై ఈ మధ్యనే సస్పెన్షన్ ఎత్తేశారు. వీహెచ్ తో గొడవపడ్డ హైదరాబాద్ కి చెందిన మరో నేత శ్రీకాంత్ మీద కూడా సస్పెన్షన్ త్వరలో ఎత్తేయబోతున్నారట. ఇవన్నీ వీహెచ్ కి కోపం తెప్పించాయనీ, తన స్థాయి ఏంటో తెలియజేయాలంటే కీలక పదవి దక్కించుకోవాలనే పూనికతో ఉన్నారంటూ కథనాలు వినిపిస్తున్నాయి. మరి, వీహెచ్ డిమాండ్ ఏమౌతుందో చూడాలి.